Sakshi News home page

డొనాల్డ్ ట్రంప్‌కే ఒబామా సోదరుడి ఓటు

Published Mon, Jul 25 2016 5:36 PM

డొనాల్డ్ ట్రంప్‌కే ఒబామా సోదరుడి ఓటు - Sakshi

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున బరిలోవున్న డొనాల్డ్ ట్రంప్‌కే ఈసారి తాను ఓటేస్తానని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కెన్యా సోదరుడు మాలిక్ ఒబామా (సవతి తల్లి కుమారుడు) స్పష్టం చేశారు. మొదటి నుంచి డెమోక్రట్లకు మద్దతిస్తున్న 58 ఏళ్ల మాలిక్ ఒబామా ఈసారి మనసు మార్చుకున్నారు. అమెరికాను గొప్ప దేశంగా తీర్చిదిద్దడం గొప్ప నినాదమని, అందుకని తాను ట్రంప్‌కు ఓటేస్తానని కెన్యాలోని న్యాంగోమా కొగెలో గ్రామం నుంచి మాలిక్ ఒబామా తన అభిప్రాయాన్ని అమెరికా మీడియాకు తెలిపారు.
 

 ‘డొనాల్డ్ ట్రంప్ హృదయం నుంచి మాట్లాడుతారు. అందుకే ఆయన నాకు నచ్చుతారు. అమెరికా గొప్ప దేశంగా తీర్చిదిద్దడం గొప్ప నినాదం. నేను ట్రంప్‌ను కలసుకోవాలని అనుకుంటున్నాను’ అని మాలిక్ ఒబామా వ్యాఖ్యానించారు. అలాగే ఆయన ఒబామా యంత్రాంగం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణల కారణంగానే తాను తన విధేయతను ‘లింకన్ పార్టీ’కి మార్చుకున్నానని ఆయన చెప్పారు.
 

 అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రట్ల తరఫున పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్‌కు ఒబామా ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. ప్రైవేట్ ఈ మెయిళ్ల వ్యవహారంలో హిల్లరీ క్లింటన్‌పై వచ్చిన ఆరోపణలను విచారించకూడదని బరాక్ ఒబామా ప్రభుత్వం నిర్ణయించడం పట్ల కూడా మాలిక్ ఒబామా అసహనంతో ఉన్నారు. తన మంచి మిత్రుల్లో ఒకరైన మొహమ్మద్ గడాఫీని క్లింటన్, ఒబామాలే కలసి చంపించారని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాలిక్ ఒబామా తన ఆత్మకథను 2012లో రాసి తన దివంగత తండ్రికి అంకితం ఇచ్చిన విషయం తెల్సిందే.

Advertisement

What’s your opinion

Advertisement