ఉద్యోగం కావాలంటే మొసలిని ముద్దాడాల్సిందే! | Sakshi
Sakshi News home page

ఉద్యోగం కావాలంటే మొసలిని ముద్దాడాల్సిందే!

Published Sat, Jul 4 2015 4:21 PM

ఉద్యోగం కావాలంటే మొసలిని ముద్దాడాల్సిందే!

బీజింగ్: చైనాలోని గ్వాంగ్‌డాంగ్ రాష్ట్రంలో ఓ కంపెనీ గత బుధవారం నాడు సేల్స్ విమెన్ ఉద్యోగాల కోసం వచ్చిన తొమ్మిది మంది అమ్మాయిలకు భయంకరమైన పరీక్ష పెట్టింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అమ్మాయిలు అందంగా ఉండడమే కాకుండా తెలివితేటలు కలవారై ఉండాలన్నది ముందస్తు షరతు. ఈ షరతుకులోబడి దరఖాస్తు చేసుకున్నవారిలో కొంతమంది అమ్మాయిలు తీరా ఇంటర్వ్యూకు హాజరై తొలిరౌండు పరీక్ష చూసి హతాషులయ్యారు. ఇంతకు ఆ పరీక్ష ఏమిటంటే సజీవంగా ఉన్న ఓ మొసలి నోటిని ముద్దు పెట్టుకోవాలి. ఇదేమి పరీక్ష బాబు! అని ప్రశ్నిస్తే అమ్మాయిలు ముద్దుగా ఉండడమే కాదని, వారికి కాసింత ధైర్య సాహాసాలు కూడా ఉండాలన్నది తమ విశ్వాసమని, అందుకే ఈ పరీక్ష పాసై తీరాల్సిందేనని కంపెనీ బాసులు సెలవిచ్చారు. ఈ తొలిరౌండ్ టెస్ట్‌లో పాసైన వారికి వెయ్యి రూపాయల నజరానా అక్కడికక్కడే ఇచ్చారు.

 మొసలిలాంటి సరీసృపాలను ముద్దు పెట్టుకుంటే వాటిపట్ల భయం పోతుందని ఓ స్థానిక ఫిలాసఫీ ఇనిస్టిట్యూట్‌లో పనిచేస్తున్న సీనియర్ రీసెర్చర్ పెంగ్ పెంగ్ తెలిపారు. అయితే ఇంటర్వ్యూకు వచ్చిన అభ్యర్థులకు హాని జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కంపెనీ యాజమాన్యందేనని ఆయన స్పష్టం చేశారు. మొసలిని ముద్దు పెట్టుకునే పరీక్ష సందర్భంగా ఎంతోమంది మగాళ్లు ముందుకొచ్చారట. అయితే తమకు కావాల్సింది సేల్స్ విమెన్ తప్పించి సేల్స్‌మెన్ కాదంటూ కంపెనీ వారిని అనుమతించలేదని ‘పీపుల్స్ డెయిలీ ఆన్‌లైన్’ పేర్కొంది. చివరకు ధైర్యం చేసి ముద్దు పెట్టుకున్న అమ్మాయిలకు వెయ్యి రూపాయల అవార్డు ఇచ్చి తర్వాతి స్థాయి ఇంటర్వ్యూకు పంపించారు. మొసలి మాంసం, చర్మంతో తయారు చేసిన ఆరోగ్య ఉత్పత్తులను తాము విక్ర యిస్తామని, అందుకని తాము ఇలాంటి పరీక్ష పెట్టడం సమంజసమేనని కంపెనీ యాజమాన్యం ప్రకటించింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement