భారతీయ సంస్కృతి చూస్తే గర్వంగా ఉంది | Sakshi
Sakshi News home page

భారతీయ సంస్కృతి చూస్తే గర్వంగా ఉంది

Published Sun, Jul 3 2016 2:43 AM

భారతీయ సంస్కృతి చూస్తే గర్వంగా ఉంది - Sakshi

- ఇల్లినాయిస్ గవర్నర్ బ్రూస్ రానర్
దేశ ఔన్నత్యాన్ని చాటుతున్న ఎన్నారైలకు అభినందనలు: వెంకయ్య
- అట్టహాసంగా ప్రారంభమైన ‘ఆటా’ వేడుకలు
 
 చికాగో నుంచి శ్రీనాథ్
 భారతీయ సంస్కృతి చూస్తే గర్వంగా ఉందని ఇల్లినాయిస్ గవర్నర్ బ్రూస్ రానర్ అన్నారు. అమెరికాలోని చికాగోలో శనివారం ఆయన ‘ఆటా’ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి కుటుంబాల సంప్రదాయాన్ని అమెరికన్లూ నేర్చుకోవాలని కోరారు. వేడుకలకు హాజరైన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..భారతదేశ ఔన్నత్యాన్ని, సంస్కృతిని విదేశీయులు కూడా ఇష్టపడుతున్నారని, దానికి భారతీయులు చేస్తోన్న కృషి ఎంతో అభినందనీయమన్నారు.

అమెరికాలోని భారతీయులు మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎన్నారైలను కోరారు. ఆటా వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రోజా చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్న లక్షలాది మంది ఎన్నారైలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆటా వేడుకలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ స్థాయిలో క్యాడర్ రావడం సంతోషంగా ఉందనీ, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు కోరుకున్నట్లుగా పాలన జరగడం లేదని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శృతిలయలు సినిమాలో చిన్నారిగా నటించిన షణ్ముఖ శ్రీనివాస్ చేసిన కూచిపూడి నృత్యం తొలిరోజు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

 ఆకట్టుకున్న పల్లె సెట్టింగ్ : ఆటా వేడుకల్లో రోజ్‌మెంట్ ఈ స్టీఫెన్ సెంటర్‌లో భారత పల్లెదనాన్ని ప్రతిబింబిస్తూ వేసిన సెట్టింగ్ పలువురిని అమితంగా ఆకట్టుకుంది.  తొలి రోజు ఆటా వేడుకల్లో  ఎంపీలు మిథున్‌రెడ్డి,  జితేందర్‌రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం కడియంశ్రీహరి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement