వ్యక్తిగత ప్రశంసలతో టీం వర్క్ కు ప్రోత్సాహం | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత ప్రశంసలతో టీం వర్క్ కు ప్రోత్సాహం

Published Mon, May 2 2016 4:10 PM

వ్యక్తిగత ప్రశంసలతో టీం వర్క్ కు ప్రోత్సాహం

మనిషికి ఇచ్చే వ్యక్తిగత గుర్తింపు.. ప్రశంసలు... వారిని టీం వర్క్  చేయడానికి  ప్రోత్సహిస్తుందని, వారిలో మంచి శక్తినిస్తుందని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. చైనాలోని ఓ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ లో పనిచేసేవారిపైనా, కొందరు విద్యార్థులపైనా జరిపిన అధ్యయనాల్లో ఈ కొత్త వివరాలు వెల్లడయ్యాయి.  ప్రయోగశాలలు,  ఫీల్డ్ ప్రయోగాల ద్వారా అధ్యయనాల్లో... వ్యక్తిగత గుర్తింపు.. టీమ్ వర్క్ కు ఎంతగానో సహకరిస్తుందని కనుగొన్నారు.

వ్యక్తి పని తీరుపై అతడికి ఇచ్చే ప్రశంసల ప్రభావం ఉంటుందని చైనాలో జరిపిన కొత్త పరిశోధనల్లో తెలుసుకున్నారు.  ఒక్కొక్కరి పనిని వ్యక్తిగతంగా గుర్తించడం, ప్రశంసలు తెలియజేయడం  టీం వర్క్ ను ప్రోత్సహిస్తుందని అమెరికా నార్త్ కరోలినా స్టేట్ యూనివర్శిటీకి చెందిన  పూలే కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ సహ అధ్యయనకారుడు ప్రొఫెసర్ బ్రాడ్లీ కిర్క్ మాన్ తెలిపారు. అధ్యయనకారులు చైనా విశ్వవిద్యాలయానికి చెందిన 256 మంది విద్యార్థులపై జరిపిన అధ్యయనాల్లో ఒక్కొక్కరి పనులను  విడివిడిగా గుర్తించడంతోపాటు, సమూహాలతో కలసికూడ గుర్తించారు. వ్యక్తిగత పనుల్లో ప్రశంసలు పొందిన వారే సమూహాల్లో శక్తివంతంగా పనిచేసినట్లు గుర్తించామని తమ అధ్యయనాల వివరాలను అప్లైడ్ సైకాలజీ జర్నల్ లో ప్రచురించారు.

రెండవ రౌండ్ లోనూ వ్యక్తిగత ప్రశంసలు పొందిన వ్యక్తి... ఇటు వ్యక్తిగతంగానూ, సమూహాలతో కలసి కూడా పనిలో  గణనీయమైన మెరుగును కనబరచినట్లు అధ్యయనకారులు గుర్తించారు. అంతేకాక వ్యక్తిగత గుర్తింపులేని వ్యక్తి టీమ్ మెంబర్ గా కూడ ఎటువంటి మెరుగుదలను చూపించలేకపోయినట్లు తెలుసుకున్నారు. ఉత్తర చైనాలోని ఓ ఉత్సత్తి సంస్థ కూలీలపై కూడ  పరిశోధకులు ఈ కొత్త ప్రయోగాలను నిర్వహించారు. కంపెనీలోని కొన్ని విభాగాల్లో 'ఎంప్లాయీ ఆఫ్ ద మంత్' పేరుతో టీమ్ లోని అత్యధిక పనిమంతులను గుర్తించి మిగిలిన విభాగాల్లో గుర్తించకుండా వదిలేశారు.  అయితే ఇక్కడకూడా ప్రత్యేక గుర్తింపునివ్వకుండా వదిలేసిన టీమ్ లలో అటు వ్యక్తిగతంగా గాని, టీమ్ వర్క్ లో గాని  పనిలో ఎటువంటి ప్రత్యేక ఫలితాలూ కనిపించకపోవడాన్ని తెలుసుకున్నారు.

Advertisement
Advertisement