క్రిస్టియన్లపై ఐఎస్ హత్యాకాండ | Sakshi
Sakshi News home page

క్రిస్టియన్లపై ఐఎస్ హత్యాకాండ

Published Tue, Feb 17 2015 3:14 AM

క్రిస్టియన్లపై ఐఎస్ హత్యాకాండ

 కైరో: మతోన్మాదం నెత్తికెక్కిన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు మరో దారుణానికి తెగబడ్డారు. ఈజిప్ట్‌కు చెందిన 21 మంది క్రిస్టియన్ కార్మికులను లిబియాలో అత్యంతపాశవికంగా హతమార్చారు. లిబియా రాజధాని ట్రిపోలీ దగ్గర్లోని సముద్రతీరంలో ఆ క్రిస్టియన్లకు ఆరెంజ్ రంగు దుస్తులు వేసి, చేతులను వెనక్కు విరిచికట్టేసి, వరుసగా నిల్చోబెట్టి నలుపురంగు దుస్తులు, ముఖాలకు మాస్క్‌లు  ధరించి ఉన్న ఉగ్రవాదులు అత్యంత హేయం గా తలలు తెగనరికారు.

 

ఆ  దృశ్యాలున్న వీడియోను ఆన్‌లైన్లో ఆదివారం విడుదల చేసి, ప్రపంచాన్ని దిగ్భ్రమకు గురి చేశారు. ఐదు నిమిషాల వ్యవధి ఉన్న ఆ వీడియో చివరలో ఒక ఉగ్రవాది ‘అల్లాపై ఒట్టేసి చెబుతున్నాం. షేక్ ఒసామా బిన్ లాడెన్ శరీరాన్ని మీరు దాచి న సముద్ర జలాల్లోనే మీ రక్తాన్ని కలుపుతాం’ అంటూ ప్రతినబూనిన దృశ్యం కూడా ఉంది. తమ తదుపరి లక్ష్యం ఇటలీ రాజధాని రోమ్ అనే హెచ్చరిక ఆ వీడియోలో ఉంది. లిబియాలోని సిర్తె పట్టణంలో నెల రోజుల క్రితం ఆ క్రిస్టియన్ కార్మికులను ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఐఎస్ బలంగా ఉన్న సిరియా, ఇరాక్‌లకు ఆవల మరో దేశంలో ఈ స్థాయి హత్యలకు తెగబడడం ఐఎస్‌కు ఇదే తొలిసారి.
 

ఉగ్రవాదుల దుశ్చర్యపై ఈజిప్ట్ తీవ్రంగా స్పందించింది. ఆ వీడియో విడుదలైన కాసేపటికే.. పొరుగుదేశం లిబియాలోని ఐఎస్ ఉగ్రవాదసంస్థ స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, ఆయుధాగారాలపై యుద్ధ విమానాలతో పెద్ద ఎత్తున పలు దఫాలుగా వైమానిక దాడులు చేసింది. ఆ దాడుల్లో దాదాపు 64 మంది మిలిటెంట్లు హతమయ్యారని, ఐదుగురు పౌరులు చనిపోయారని లిబియా అధికారులు వెల్లడించారు. బషీర్ అల్ దెర్సి సహా ఐఎస్ కీలక నేతలు ముగ్గురు ఈ దాడుల్లో చనిపోయారన్నారు. ఉగ్రవాదుల ప్రాబల్యం ఉన్న దెర్నా, సిర్తె పట్టణాలపై జరిగిన ఆ దాడులకు లిబియా సైన్యం కూడా సహకరించిందన్నారు.

 

ఈజిప్ట్‌తో సమన్వయంతో రానున్న రోజుల్లో ఐఎస్‌పై మరిన్ని దాడులు చేస్తామన్నారు. ఈ దాడులతో ఐఎస్‌పై పోరులో ఈజిప్ట్ ప్రత్యక్షంగా పాల్గొనడం ప్రారంభమైంది. ఉగ్రవాదుల చర్యను అత్యంత విషపూరిత చర్యగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతే ఎల్ సిసి అభివర్ణించారు. ఇరాక్, సిరియాల్లో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఐఎస్‌పై జరుపుతున్న పోరును లిబియాకు విస్తరించాలని కోరారు. ‘హంతకులపై ఎప్పుడు, ఎలాంటి చర్య తీసుకోవాలనే నిర్ణయం తీసుకునే హక్కు ఈజిప్ట్‌కు ఉంది. ఉగ్రవాదాన్ని అణచేసే సామర్ధ్యం ఈజిప్ట్‌కు ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో వ్యాప్తి చెందుతున్న ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలన్నీ కలసిరావాలి’ అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సిసి.. దేశవ్యాప్తంగా వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు.

లిబియాకు ఎవరూ వెళ్లొద్దని, అక్కడ ఉన్నవారు కూడా తిరిగి వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. న్యూయార్క్‌లో జరుగుతున్న ‘ఉగ్రవాదంపై పోరు’ సదస్సులో పాల్గొనేందుకు తక్షణమే వెళ్లాలని విదేశాంగ మంత్రిని ఆదేశించారు. కాగా, ఐఎస్ ఉగ్రవాదుల మారణకాండపై పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా ఖండించారు. ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, ఐరాస భద్రతామండలి, అమెరికా, ఖండించాయి.
 
 

Advertisement
Advertisement