బాంబులై పేలనున్న బాలలు! | Sakshi
Sakshi News home page

బాంబులై పేలనున్న బాలలు!

Published Thu, Mar 12 2015 8:13 PM

బాంబులై పేలనున్న బాలలు!

డమాస్కస్: పాపం పుణ్యం...ప్రపంచ మార్గం ఏమీ తెలియని పిల్లలు, ఐదారేళ్ల పాపలు...మన మధ్యనే బాంబులై పేలనున్నారు. మనుషుల పీకలను నిర్ధాక్షిణ్యంగా తెగకోయనున్నారు. గుండెల్లోకి తుపాకీ గుళ్లను గురిచూసి పేల్చనున్నారు. ఈ భయంకర పరిణామం కలియుగ అంతంలో కాదు, కలికాలంలోనే జరగనున్నది. ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు తమ ప్రాబల్యంలోని ఉత్తర ఇరాక్, తూర్పు సిరియా ప్రాంతాల్లో పసి పాపల బుర్రల్లో విషాన్ని కూరుతున్నారు. వారికి ఏకే-47 సహా వివిధ రకాల ఆయుధాలను ఉపయోగించడంలో, మర మనుషులుగా నిర్ధాక్షిణ్యంగా మనుషులను చంపడంలో కఠిన శిక్షణ ఇస్తున్నారు. 19 ఏళ్ల ఇజ్రాయెలీ అరబ్‌ను పట్టుమని పదేళ్లు కూడా లేని ఓ బాలుడు తుపాకీతో కాల్చి చంపుతున్న వీడియో దృశ్యాలను ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు ఇటీవల విడుదల చేయడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

తూర్పు సిరియా ప్రాంతంలో గుర్తుతెలియని చోట పిల్లలకు శిక్షణ ఇస్తున్న వీడియోలను కూడా ఉగ్రవాదులు విడుదల చేశారు. వాటిలో తాము నరికేసిన తలలను పిల్లల చేతికిచ్చి మోయించడం, మానవుల తలలను ఎలా తెగకొట్టాలో బొమ్మలతో ప్రాక్టీస్ చేయించడం లాంటి దారుణమైన దృశ్యాలున్నాయి. ఆ పిల్లల్లో ముక్కుపచ్చలారని ఐదేళ్ల పాపలు కూడా ఉండడం భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది.

‘ఎలాంటి బాహ్య ప్రపంచ ప్రభావానికి అవకాశంలేని ఉత్తర ఇరాక్, తూర్పు సిరియా ప్రాంతాల్లో బాలలకు ఇలాంటి శిక్షణ ఇవ్వడం. గుండెలను పిండేసే బాధను కలిగిస్తోంది. దీన్నిబట్టి టెర్రరిజంపై పోరు అనతికాలంలో ముగిసేది కాదని, సుదీర్ఘకాలం కొనసాగుతందని అర్థం అవుతోంది’ అని ఉగ్రవాద నిరోధక సంస్థ ‘కిల్లియమ్ ఫౌండేషన్’ నిపుణుడు చార్లీ వింటర్ వ్యాఖ్యానించారు. ‘ ఉగ్రవాదులు ఎలా పిల్లలను రక్త పిపాసులుగా మారుస్తున్నారో అంతుపట్టడం లేదు. బహుశా ఆ పిల్లలకు మరో అవకాశం లేదేమో’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఐఎస్‌ఐఎస్ నియామక ప్రక్రియ గురించి తెలుసుకునేందుకు ప్రపంచ మానవ హక్కుల గురించి పోరాడుతున్న ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ ఉగ్రవాదుల శిక్షణలో చేరిన నలుగురు యువకులను ఇంటర్వ్యూ చేసింది.

వారిలో అమర్ అనే యువకుడు ‘నాకిప్పుడు 17 ఏళ్లు. గతేడాదే నేను ఇందులో చేరాను. అల్లా పేరిట అవసరమైతే మానవ బాంబులా పేలిపోవడానికి కూడా సిద్ధమంటూ సంతకం కూడా చేశాను. నన్ను రహస్యంగా ఏమీ చేర్చుకోలేదు. బహిరంగాగానే వచ్చి చేరుతావా అంటూ నన్నడిగారు. వారి యూనిఫారాలు, ఆయుధాలు చూసి ఆకర్షితుడనై చేరాను. ఇప్పుడు నాకు జీతం కూడా ఇస్తున్నారు. వారు చెప్పినట్టు చేయడం మినహా నాకు మరో ఆలోచన లేదు’ అని చెప్పాడు.

Advertisement
Advertisement