అమెరికాలో పెరుగుతున్న ‘ముస్లిమోఫోబియా’ | Sakshi
Sakshi News home page

అమెరికాలో పెరుగుతున్న ‘ముస్లిమోఫోబియా’

Published Fri, Oct 14 2016 6:47 PM

అమెరికాలో పెరుగుతున్న ‘ముస్లిమోఫోబియా’ - Sakshi

న్యూయార్క్: సకల జాతుల నిలయమైన అమెరికాలో నేడు ‘ముస్లిమోఫోబియా’ తీవ్రంగా పెరిగిపోయింది. ముస్లింలు టెర్రరిస్టుల రూపంలో ఎప్పుడు తమపై విరుచుకు పడిపోతారేమోనని అమెరికన్లు భయపడుతుండగా, అమెరికన్లు ఎక్కడ దాడి చేస్తారేమోనని సాధారణ ముస్లిం ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పాఠశాలల్లో, కాలేజీల్లో తమ పిల్లలకు ఎదురవుతున్న పరాభవాలను తట్టుకోలేక పిల్లలను తీసుకొని వారి ముస్లిం తల్లిదండ్రులు అమెరికా విడిచి విదేశాలకు ఇప్పటికే పారిపోగా మరికొందరు పారిపోవడానికి సన్నద్ధం అవుతున్నారు.

టెర్రరిస్టులకు వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వానికి సహకారం అందించి అనేక అవార్డులు అందుకున్న స్కాలర్ జీషాన్ ఉల్ హసన్ ఉస్‌మాని కూడా అక్టోబర్ ఎనిమిదవ తేదీన తన భార్య బినిష్ భగవాని, ఇద్దరు పిల్లలను తీసుకొని అమెరికాకు గుడ్‌బై చెప్పి శాశ్వతంగా పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. కంప్యూటర్ డేటా సైంటిస్ట్‌గా అమెరికా ప్రభుత్వంలో పనిచేసిన ఆయన టెర్రరిస్టుల ఆత్మాహుతి బాంబులను నిర్వీర్యం చేసే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి అవార్డు అందుకున్నారు. నాలుగు అదనపు డిగ్రీలు చేసి పలు రంగాల్లో విశిష్ట సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు కూడా అందుకున్నారు. పాఠశాలలో తన ఏడేళ్ల కుమారుడు అబ్దుల్ అజీజ్‌కు ఎదురైన పరాభవాన్ని తట్టుకోలేక ఆయన అమెరికా విడిచి పోవాలని నిర్ణయించుకున్నారు.

ఉత్తర కరోలినాలోని కెరీ నగరంలోని స్కూల్‌లో చదువుతున్న తన పిల్లవాడు అబ్దుల్‌ను తోటి పిల్లలు ఎలా వేధించారో జీసాన్ సామాజిక వెబ్‌సైట్ పేజ్‌బుక్‌లో వివరించారు. ముస్లిం అంటూ తోటి పిల్లలు ఎప్పుడు తన కుమారుడిని గేళి చేసేవారని, ఓ రోజున హలాల్ చేయని మాంసం తినమని ఒత్తిడి చేస్తే తినను అన్నందుకు బాగా కొట్టారని, చేయిని మెలితిప్పటంతో చేతికి బలమైన గాయం కూడా అయిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత స్కూల్ బస్కెక్కి ఇంటికి రావాలనుకుంటే బస్సులో నుంచి పిల్లలు బయటకు తోసి వేశారని, దాంతో చాలాదూరానున్న ఇంటికి తన కుమారుడు కాలినడకనే వచ్చాడని ఆయన తెలిపారు. ఆ నాటి నుంచి అమెరికాలో ఉండబుద్ధికాక పాకిస్థాన్ వచ్చానని ఆయన చెప్పారు. ఉద్యోగం రీత్యా తరచుగా అమెరికా నుంచి పాకిస్థాన్ వచ్చేవాడిని కనుక పాక్ వెళ్లడం కష్టం కాలేదని, లేకపోతే పాస్‌పోర్టే దొరికేది కాదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  ‘డొనాల్డ్ ట్రంప్ ఉన్న అమెరికాకు స్వాగతం’ అన్న వ్యాఖ్యతో ఆయన తన ఫేస్‌బుక్ పేజీని ముగించారు.

ఒకప్పుడు అమెరికా ఇలా ఉండేది కాదని, ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని, ముస్లింలంటే ద్వేషం బాగా పెరిగిపోయిందని, క్రిమినల్స్ అన్ని జాతుల్లో ఉంటారని, ఎవరో చేసిన నేరానికి అమాయక ముస్లిం ప్రజలను ఎందుకు ఏడిపిస్తారో అర్థం కావడం లేదని, ఇక అమెరికాలో ఉండలేమని తిరిగొచ్చేశామని పాకిస్థాన్ నుంచి హఫింగ్టన్ పోస్ట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన భార్య బినిష్ భగవాని వివరించారు. ప్రస్తుతం అమెరికాలో 33 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. వారిలో ఎక్కువ మందికి ఇలాంటి పరాభవాలే ఎదురవుతున్నాయనే విషయం అలీన్ ఖాన్ అనే 17 ఏళ్ల యువతి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు రాసిన లేఖ వెల్లడిస్తోంది.

‘ముస్లింలను తన్ని తగిలేయండి. మిగిలిన వారిని క్యాంపుల్లో నిర్బంధించండి... ఉదారవాదులు, మంచి ముస్లింలు ఎప్పుడో మరణించారు...ముస్లింలకు మనకు మధ్య అడ్డుగోడలు కట్టండి లేదా ముస్లింల కోసం గ్యాస్ చాంబర్లు నిర్మించండి!....ఇలాంటి అన్‌లైన్ సందేశాలను చూసి తాను భయపడిపోయానని అలీన్, ఒబామాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఓ ప్రాజెక్ట్ విషయమై తాను ఆన్‌లైన్‌లో పనిచేస్తున్నప్పుడు ఇలాంటి విద్వేష వ్యాఖ్యలు ఎదురయ్యాయని ఆమె తెలిపారు.


తన తండ్రి పాకిస్థాన్ నుంచి వలస వచ్చి అమెరికాలో స్థిరపడ్డారని, భారత్-అమెరికాకు చెందిన మహిళను ఇక్కడే పెళ్లి చేసుకున్నారని, తాను వారికి అమెరికాలోనే పుట్టానని అలీనా తెలిపారు. తనకు ఇద్దరు అక్కలున్నారని, వాళ్లకు కూడా విద్వేష అనుభవాలు ఎదురయ్యాయనే విషయం ఆ తర్వాత తెల్సిందని ఆమె చెప్పారు. తాను జర్మన్ నగరంలో చదువుకున్నానని, ఇక్కడ వాషింగ్టన్ యూనివర్శిటీలో చేరబోతున్నానని, ముందు జీవితం ఎలా ఉంటుందో అర్థం కావడం లేదని ఆమె వాపోయారు. ఇంతకుముందు ఎన్నడూ ముస్లిం మహిళ అన్న కారణంగా ఎప్పుడూ చిన్నచూపుకు గురికాలేదని ఆమె చెప్పారు. ఆమె లేఖను ఒబామా చదివారో, లేదోగానీ ఆయన నుంచి మాత్రం ఆమెకు ఎలాంటి సమాధానం రాలేదు.

అమెరికాలో నివసిస్తున్న ముస్లింలకు వ్యతిరేకంగా హింసాత్మక దాడులు ఇటీవలికాలంలో చాలా పెరిగాయి. గతంతో పోలిస్తే ఒక్క 2015 సంవత్సరంలోనే ముస్లింలపై 80 శాతం దాడులు పెరిగాయి. నిజం చెప్పాలంటే అమెరికన్లకు ముస్లిం మతం గురించిగానీ, వారి సంస్కృతి గురించిగానీ పెద్దగా ఎవరికి తెలియదు. కొద్దిగా తెలిసిన వారు 57 శాతంకాగా అసలు ఏమీ తెలియనివారు 26 శాతం మందని అమెరికాలోని ‘పబ్లిక్ రిలీజియన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’ గతంలో ఓ నివేదికలో పేర్కొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement