‘శాంతి’ పెరెజ్ ఇకలేరు | Sakshi
Sakshi News home page

‘శాంతి’ పెరెజ్ ఇకలేరు

Published Thu, Sep 29 2016 12:47 AM

‘శాంతి’ పెరెజ్ ఇకలేరు - Sakshi

అనారోగ్యంతో కన్నుమూసిన ఇజ్రాయెల్ మాజీ అధ్యక్షుడు
- 2 వారాల క్రితం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిక
- శుక్రవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
 
 టెల్ అవీవ్: ఇజ్రాయెల్ మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిమోన్ పెరెజ్ (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా  అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన.. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. రెండు వారాల క్రితం గుండె పోటు రావడంతో పెరెజ్‌ను కుటుంబ సభ్యులు టెల్ అవీవ్ శివారులోని చాయిమ్ షీబా మెడికల్ సెంటర్‌కు తరలించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. శుక్రవారం అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇజ్రాయెల్ రాజకీయాల్లో పెరెజ్‌ది తిరుగులేని పాత్ర. చాలాకాలం పాటు ఇజ్రాయెల్ రాజకీయాలకు ఆయన కేంద్ర స్థానంగా ఉన్నారు. 1923లో పోలండ్‌లోని విస్‌న్యూలో జన్మించిన ఆయన.. 1934లో ఇజ్రాయెల్‌కు వలస వచ్చారు. దాదాపు ఏడు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన ఆయన 1959లో తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తర్వాత ఇజ్రాయెల్‌లోని అన్ని ప్రముఖ కార్యాలయాల్లో పనిచేశారు. రెండు సార్లు ప్రధాన మంత్రిగా పనిచేసిన పెరెజ్.. 2007 నుంచి 2014 వరకు దేశాధ్యక్షుడిగా ఉన్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా శాంతి కోసం తీవ్రంగా కృషి చేశారు. ఇందుకు గాను 1994లో నోబెల్ శాంతి బహుమతి కూడా అందుకున్నారు.

 ప్రముఖుల సంతాపం
 పెరెజ్ మృతి పట్ల ప్రపంచ దేశాల నేతలు సంతాపం వెలిబుచ్చారు.  ‘ఓ దీపం ఆరిపోయింది. కానీ ఆయన మాకిచ్చిన స్ఫూర్తి వెలుగుతూనే ఉంటుంది’ అని అమెరికా అధ్యక్షుడు ఒబామా వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్, మధ్య తూర్పు ప్రాంతంలో శాంతిని నెలకొల్సిన మహా నేత పెరెజ్ అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ కొనియాడారు. ఆయన దృఢ నిశ్చయం తమకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. తాను గురువుగా అభిమానించి, ప్రేమించిన వ్యక్తి పెరెజ్ మృతి తనకు తీరని లోటని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ అన్నారు. పెరెజ్ మరణం దేశానికి తీరని లోటని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ రక్షణ రంగాన్ని అన్నివిధాలా పటిష్ట పరిచిన ఘనత ఆయనదని కొనియాడారు.
 
 భారత్‌తో సాన్నిహిత్యం
 భారత్ ఇజ్రాయెల్ సంబంధాలలో పెరెజ్ కీలక పాత్ర పోషించారు. 2000, 2001, 2002 సంవత్సరాల్లో ఆయన భారతదేశంలో పర్యటించారు. భారత్ అంటే అత్యంత అభిమానం కలిగిన పెరెజ్.. ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్యం కలిగిన దేశంగా తరచూ కొనియాడేవారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూల నుంచి స్ఫూర్తిని పొందానని అనేవారు.తనకు గాంధీ గురువు అని, నెహ్రూ రాజు అని అభివర్ణించే వారు. ఆ మహనీయుల ఆశీర్వాదాలను పొందడం భారత్ అదృష్టమని అనేవారు. అంతేకాదు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్న డిమాండ్‌కు మద్దతు పలికారు.

పెరెజ్ మృతి పట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పెరెజ్ మృతితో ఇజ్రాయెల్ గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రపంచస్థాయి కీలక నాయకుడిని కోల్పోయామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారత్‌కు స్నేహితుడైన ఆయన మరణం తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, లోక్‌సభ ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఎల్‌కే అద్వానీ ఆయన మృతి పట్ల విచారం వెలిబుచ్చారు.

Advertisement
Advertisement