ఇది ఉగ్రదాడే | Sakshi
Sakshi News home page

ఇది ఉగ్రదాడే

Published Tue, Jun 14 2016 2:16 AM

ఇది ఉగ్రదాడే - Sakshi

 నైట్ క్లబ్ నరమేధంపై ఎఫ్‌బీఐ..
 ఇది మా సైనికుడికి దేవుడు కల్పించిన అవకాశం: ఐసిస్

- ఇది దేశీయ ఉగ్రవాద ఉన్మాదం: ఒబామా   
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రపంచదేశాలు.. మృతులకు నివాళి
- ఆర్లెండో బాధితుల్లో పలువురి పరిస్థితి విషమం
- నివాళిగా ఇంద్రధనుస్సు రంగుల్లో ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలు  
- ఉగ్రవాది మతిన్ ప్రవర్తన మొదట్నుంచీ అనుమానాస్పదమే
- మతిన్ తండ్రి మిర్ సిద్ధిఖీ తాలిబాన్ మద్దతుదారు
 
 ఆర్లెండో: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగిన దారుణ మారణకాండ ఉగ్రదాడేనని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) స్పష్టం చేసింది. దేశీయంగా పెరుగుతున్న ఉగ్రవాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది.  విదేశీ ఉగ్రవాదానికి దీనితో ఏమాత్రం సంబంధం లేదని వెల్లడించింది. గే ప్రైడ్ మంత్ సందర్భంగా పల్స్ క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 49 మందిని పొట్టనపెట్టుకున్న ఒమర్ మతీన్ (29) ఘటన జరిగేందుకు ముందు 911 (అమెరికా హెల్ప్‌లైన్ నెంబరు)కు ఫోన్ చేసి ఐసిస్ గురించి మాట్లాడాడని తెలిపింది.  అయితే మతీన్‌కు నేరుగా ఉగ్రవాదులతో సంబంధాలు లేవని   2013లో తోటి ఉద్యోగులతో మతం గురించి విద్వేషపూరిత వ్యాఖ్యల ఘటనలో, 2014లో ఓ అమెరికా ఆత్మాహుతిదాడి దళ సభ్యుడితో సంబంధాల విషయంలో.. మతీన్‌ను విచారించి వదిలేసినట్లు వెల్లడించింది. అయితే.. ఈ ఘటన తర్వాత అమెరికా ఉగ్రవాద వ్యతిరేక విభాగం పనితీరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అటు ఐసిస్‌కూడా ఆర్లెండో కాల్పులకు పాల్పడింది తమవాడేనని రేడియో బులెటిన్‌లో ప్రకటించింది. ‘అమెరికా కాలిఫేట్‌లోని మా సైనికుల్లో ఒకడైన మతీన్‌కు ఈ పనిచేసేందుకు దేవుడు అవకాశం కల్పించాడు’ అని ప్రకటించింది.

 ‘ప్రపంచ’మంత సానుభూతి.. అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణమైన మారణకాండపై ప్రపంచదేశాలన్నీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఒర్లాండో ఘటనను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్, భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఖండించారు. మృతుల కుంటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బాధితులకు సంఘీభావంగా పారిస్ మేయర్ కార్యాలయంపై అమెరికా జెండాను ఎగురవేశారు. ఫ్రాన్స్, బ్రిటన్, బ్రెజిల్, సైప్రస్, గల్ఫ్ దేశాలు, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల రాజకీయ ప్రముఖులు ఆర్లెండో ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాప సూచకంగా వైట్‌హౌజ్‌పై జాతీయ జెండాను అవనతం చేశారు. పలు ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలను, ఢిల్లీలోని అమెరికా దౌత్యకార్యాలయాన్నీ గే ప్రైడ్ జెండా రంగుల్లోకి మార్చేశారు. లాస్ ఏంజిలస్‌లో, పారిస్, లండన్, బెర్లిన్‌లలో వేల సంఖ్యలో ప్రజలు ఆర్లెండో మృతులకు సంతాపసూచకంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించారు.

 ఐసిస్ దాడి కాదు: ఒబామా.. ఆర్లెండో ఉగ్రఘటనకు పాల్పడిన ఉగ్రవాది ఐసిస్ సభ్యుడు కాదని.. ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్న ఐసిస్ ఉగ్ర సాహిత్యంతో ప్రభావితుడై ఈ ఘటనకు పాల్పడ్డాడని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వెల్లడించారు. ‘ఈ ఘటన దేశీయంగా పెరుగుతున్న ఉగ్రవాద ఉన్మాదానికి ఉదాహరణ’ అని అన్నారు. ఇలాంటి ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. శాన్ బెర్నార్డినోలో జరిగిన ఘటనలాంటిదేనన్నారు.

 తండ్రి, కొడుకులది ఉగ్ర ఆలోచనే!
 కాల్పులకు పాల్పడ్డ ఉగ్రవాది మతీన్ 1986లో న్యూయార్క్‌లో అఫ్గాన్ నుంచి వలసవచ్చిన కుటుంబలో పుట్టాడు. ఆ తర్వాత ఫ్లోరిడా రాష్ట్రంలోని పోర్ట్ లూసీలో ఈ కుటుంబం స్థిరపడింది. ఒమర్ మతీన్ కొన్ని రోజులు సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. కాగా, ఉగ్రవాది మతిన్ తండ్రి మిర్ సిద్ధిఖీ తాలిబాన్ మద్దతుదారుడని వెల్లడైంది. పాక్‌ను విమర్శిస్తూ.. తాలిబాన్లకు మద్దతుగా డరి భాషలో తను మాట్లాడిన వీడియోలను మిర్ ‘పాయమే అఫ్గాన్’ అనే యూట్యూబ్ చానల్లో పోస్టు చేశాడని మీడియా తెలిపింది. మిర్ పోర్ట్ సెయింట్ లూసీలో ‘డ్యూరాండ్ జిర్గా’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. శనివారం పోస్టు చేసిన వీడియోలో మిర్.. తనను తాను అఫ్గాన్ అధ్యక్షుడిగా చెప్పుకున్నారు. మతిన్ మాజీ భార్య కూడా.. తన భర్త ఉన్మాదిలా ప్రవర్తించేవాడని వెల్లడించింది. ప్రతి చిన్న విషయానికే కోపగించుకునేవాడని తెలిపింది. కాగా, శాంటా మోనికా ప్రాంతంలో ఓ కారులో మూడు రైఫిళ్లు, బాంబుల తయారీకి వినియోగించే రసాయనాలతో జేమ్స్ వెస్లే అనే యువకుడు పట్టుబడ్డాడు.

 సినిమాలో మాదిరి!..
 ‘చెవులకు చిల్లులు పడే సంగీత హోరులో అందరం డ్యాన్స్ చేస్తున్నాం. అంతలోనే తుపాకీ శబ్దాలతో వాతావరణం గందరగోళంగా మారింది. సినిమాలోని దృశ్యాలను నిజజీవితంలో చూడాల్సివచ్చింది’ అని ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు. కాల్పుల శబ్దం విని నేలపై పడుకున్న వారిపైనా ఉగ్రవాది నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపాడని మరో బాధితుడి బంధువు తెలిపారు. 39 మంది ఘటనా స్థలంలోనే చనిపోగా.. 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
 
 అధ్యక్ష ఎన్నికలపై తీవ్ర ప్రభావం?

  ఫ్లోరిడా ఘటన అధ్యక్ష ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. సోమవారం జరగాల్సిన ప్రచార ర్యాలీని డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ వాయిదా వేసుకున్నారు. అయితే.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనతో ఒబామా సర్కారుపై విరుచుకుపడ్డారు. ముస్లింలకు దేశంలోకి ప్రవేశంపై తను చెప్పిందే నిజమైందన్నారు. ఇస్లాం ఉగ్రవాదం కారణంగానే ఈ ఘటన జరిగిందన్నారు. ఇప్పటికైనా ‘ఇస్లామిక్ ఉగ్రవాదం’ అనే పదాన్ని ఒబామా ఉపయోగిచకపోతే.. ఆయన వెంటనే రాజీనామా చేయాలని ట్రంప్ డిమాండ్ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement