కాటన్‌ బట్టలతో టేకాఫ్‌ | Sakshi
Sakshi News home page

కాటన్‌ బట్టలతో టేకాఫ్‌

Published Mon, Dec 26 2016 2:42 AM

కాటన్‌ బట్టలతో టేకాఫ్‌

విమానాలకు, వాడేసిన దుస్తులకూ సంబంధం ఏమిటి? మామూలుగా చూస్తే ఈ రెండింటి మధ్య పెద్దగా లింక్‌ ఉన్నట్లు అనిపించదు. కానీ ఇది 21వ శతాబ్దమని, టెక్నాలజీ అనేది అసాధ్యాలనూ సుసాధ్యం చేస్తుందని అనుకుంటే మాత్రం విమానాలు మనం వాడేసిన దుస్తులతోనే నడుస్తాయి! అవునండి... వాడేసిన కాటన్‌ దుస్తులను విమాన ఇంధనంగా వాడే ఎథనాల్‌గా మార్చడంలో జపాన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌ (జెప్లాన్‌) విజయం సాధించింది. పులియబెట్టడం ద్వారా పత్తి పోగుల్లోని చక్కెరలను ఆల్కహాల్‌గా మార్చడం ఈ టెక్నాలజీలోని కీలక అంశం.  

జెప్లాన్‌ వ్యవస్థాపకుడు, పారిశ్రామిక వేత్త మిచిహికో ఇవమోటో 2007 మొదలు దాదాపు ఐదేళ్లపాటు జరిపిన పరిశోధనల ఫలితంగా  ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో టోక్యోలోని గ్రీన్‌ ఎర్త్‌ ఇన్‌స్టిట్యూట్, జెప్లాన్‌లు ఈ వినూత్న ఎథనాల్‌తో విమానాలను నడిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అన్నీ సవ్యంగా సాగితే 2020 నాటికి తొలి పరీక్షలు చేస్తారు. ఆ తరువాత పదేళ్లకు అంటే 2030 నాటికల్లా పూర్తిస్థాయిలో ఎథనాల్‌ వాడకం మొదలుపెడతారు. జెప్లాన్‌ ఇప్పటికే ఇయాన్, ముజి అనే రెండు ఫ్యాషన్‌ బ్రాండ్లతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా ఉన్న స్టోర్ల ద్వారా పాత బట్టల్ని సేకరించడం ఈ ఒప్పందం ఉద్దేశం. ఇంకేముంది... కొన్నేళ్లలో జపాన్‌ విమానాలు మొత్తం ఈ ఎథనాల్‌తోనే ఎగురుతాయి అనుకుంటున్నారా? చిన్న చిక్కుంది.  దుస్తుల నుంచి తయారయ్యే ఎథనాల్‌ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. వంద టన్నుల దుస్తుల నుంచి దాదాపు పదివేల లీటర్ల ఎథనాల్‌ మాత్రమే వస్తుందని అంచనా. (విమానం ఎగరడానికి సెకనుకు నాలుగు లీటర్ల ఇంధనం అవసరం అవుతుంది) అయితే.. ఈ టెక్నాలజీని దుస్తులకు మాత్రమే పరిమితం చేయాల్సిన అవసరం లేదని, కాగితం మొదలుకొని అనేక సేంద్రియ పదార్థాల ద్వారా ఎథనాల్‌ను ఉత్పత్తి చేయవచ్చునని,  దుస్తులతో ఎథనాల్‌ ఒక ఆరంభం మాత్రమేనని అంటున్నారు ఇవమోటో.

Advertisement
Advertisement