ఇంగ్లీషు రానందుకు ఇంత శిక్ష అనుభవించాలా? | Sakshi
Sakshi News home page

ఇంగ్లీషు రానందుకు ఇంత శిక్ష అనుభవించాలా?

Published Mon, Jan 18 2016 4:02 PM

ఇంగ్లీషు రానందుకు ఇంత శిక్ష అనుభవించాలా? - Sakshi

న్యూయార్క్: భారత్‌కు చెందిన సురేశ్‌భాయ్ పటేల్‌పై అమెరికా పోలీసు అధికారి అన్యాయంగా దౌర్జన్యం చేసిన సంచలనాత్మక కేసులో చివరకు బాధితుడికి న్యాయం జరగలేదు. అందుకు ఆయనకు ఇంగ్లీషు మాట్లాడడం రాకపోవడమే ప్రధాన కారణంగా చూపడం,  అదే ఆయన నేరంగా అమెరికా ఫెడరల్ కోర్టు పరిగణించడం దారుణమే కాదు దిగ్భ్రాంతికరమైన విషయం.

 భారతీయ పౌరుడైన సురేశ్ భాయ్ పటేల్ అమెరికాలో పనిచేస్తున్న తన కుమారుడిని చూడడం కోసం అలబామా రాష్ర్టంలోని హంట్స్ విల్లే  వెళ్లారు. గతేడాది ఫిబ్రవరి 6వ తేదీన ఆయన మార్నింగ్ వాక్ కోసం వీధిలోకి వచ్చారు. ఆయనకు తారసపడిన మాడిసన్ పోలీసు అధికారి ఎరిక్ పార్కర్ ఎవరు నీవు, ఎక్కడి నుంచి వస్తున్నావంటూ కేకలేశారు. ‘నో ఇంగ్లీష్’ అంటూ మూడుసార్లు, ‘ఇండియా’ అంటూ రెండుసార్లు ఇంగ్లీష్ భాషరాని పటేల్ సమాధానం ఇచ్చారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా పోలీసు అధికారి పార్కర్, పటేల్ పట్ల దురుసుగా ప్రవర్తించి మెడపట్టి తోసేశాడు.

 ఆ సంఘటనలో తీవ్రంగా గాయపడిన పటేల్‌ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెడవద్ద వెన్నుపూస దెబ్బతినడంతో ఆ ప్రాంతంలో వెన్పుపూస భాగాన్ని తొలగించి మెటల్ సిలిండర్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. వెన్నుపూస దెబ్బతిన్న కారణంగా ఆయన పెరాలసిస్ వచ్చినట్లుగా చేతులు, కాళ్లు సరిగ్గా పనిచేయకుండా అయ్యాయి. ఈ సంఘటనపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో అలబాబామా గవర్నర్ రాబర్ట్ బెంట్లీ భారత్‌కు స్వయంగా క్షమాపణలు చెప్పారు.

 

ఈ కేసులో న్యాయం జరిగేలా చూస్తానని, భారత ప్రభుత్వానికి, అమెరికా ప్రవాస భారతీయులకు అయన స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ నేపథ్యంలో అందుకు బాధ్యుడైన పోలీసు అధికారి పార్కర్‌పై అమెరికా పోలీసు యంత్రాంగం ‘దౌర్జన్యం’ కింద కేసు దాఖలు చేసింది. ఆ కేసు విచారణ జరిగిన తీరు అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ముచ్చటగా మూడోసారి విచారించిన అమెరికా ఫెడరల్ కోర్టు బుధవారం నిందితుడిపై కేసును కొట్టివేసింది. పటేల్ మాత్రం ఇప్పటికీ కుంటుతూనే నడుస్తున్నారు.

పోలీసు అధికారి పార్కర్‌పై నమోదైన కేసు ప్రకారం ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడాల్సి ఉంది. అమెరికా అధికారిని తాము శిక్షించలేమంటూ కోర్టు చేతులెత్తేసినా, నిందితుడిని నిర్దోషిగా విడుదల చేస్తున్నామంటూ తీర్పు చెప్పినా ఏదోరకంగా అర్థం చేసుకోగలం. బాధితుడికి ఇంగ్లీషు రాని కారణంగానే పోలీసు దురుసుగా ప్రవర్తించాల్సి వచ్చిందని, ఇంగ్లీషురాని వారు అమెరికాకు ఎందుకు వస్తారంటూ ఫెడరల్ కోర్టు వ్యాఖ్యానించడం దిగ్భ్రాంతికరమైన విషయం.

 

కేసులో నిందితుడైన పోలీసు అధికారి తరఫున అమెరికా అటార్ని జనరల్ ఎరిక్ హోల్డర్ వాదిస్తూ  ‘మీరు అమెరికా వచ్చినప్పుడు అమెరికా చట్టాల గురించి మీకు తెలిసే ఉంటుందనుకుంటాం. మా చట్టాల ప్రకారం ఎప్పుడు మిమ్మల్ని తనిఖీ చేసినా మీ వద్ద గుర్తింపు పత్రాలు ఉండాలి. విచారించినప్పుడు సమాధానం చెప్పడానికి కచ్చితంగా ఇంగ్లీషు వచ్చి ఉండాలి’ వ్యాఖ్యానించడం విడ్డూరం. మరి విదేశాలకు వెళుతున్న అమెరికన్లు ఆయా దేశాల భాషలు నేర్చుకునే వెళుతున్నారా?

 డిఫెన్స్ వాదనతో ఫెడరల్ జడ్జీ మెడిలిన్ హగెస్ హాయ్‌కలా ‘ పోలీసు అధికారి దురుసు ప్రవర్తనలో పటేల్ తీవ్రంగా గాయపడడం దురదృష్టకరం. ఆయన త్వరగా కోలుకోవాలని మేము కూడా ఆశిస్తున్నాం. పోలీసు అధికారి కూడా అంత దురుసుగా ప్రవర్తించి ఉండాల్సింది కాదు. అమెరికా చట్టాలు దేశ పౌరులకేకాదు విదేశాల నుంచి వలసవచ్చే వారికి కూడా సమానంగా వర్తిస్తాయి. ప్రతి ఒక్కరు గుర్తింపు కార్డు ఎప్పుడూ కలిగి ఉండాలన్నది ఇక్కడి చట్టం చెబుతోంది. పటేల్ దగ్గర సరైన గుర్తింపు కార్డు లేకుండా ఇంటి నుంచి బయటకు వచ్చారు. పైగా ఇంగ్లీషు రాదు. అందుకు తగిన మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ఈ కేసు విచారణను ఇంతటితో ముగించి కేసును కొట్టివేస్తున్నాం’ అని జ్యూరీ తరఫున తీర్పు చెప్పారు.

 జ్యూరీలో ఇద్దరు సభ్యులైన నల్లజాతీయులు నిందితుడైన పోలీసు అధికారికి శిక్ష పడాలని డిమాండ్ చేయగా,  మెజారిటీ సభ్యులైన శ్వేతజాతీయులు శిక్షించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడడం జాతి వివక్షకు ప్రత్యక్ష తార్కానం. అమెరికా వలసదారుల దేశమంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో, ఆయన ప్రభుత్వ హయాంలోనే పటేల్‌కు న్యాయం జరగక పోవడాన్ని ఏమనాలో? ఇక నుంచి అమెరికా వెళ్లేవారందరూ ‘టోఫెల్’ పరీక్షలు పాసై వెళితే మంచిదేమో!

Advertisement
Advertisement