కాందహార్‌ హైజాక్‌ వల్ల విడుదలై.. ఇప్పుడు దొరికాడు! | Sakshi
Sakshi News home page

కాందహార్‌ హైజాక్‌ వల్ల విడుదలై.. ఇప్పుడు దొరికాడు!

Published Wed, Jan 13 2016 7:43 PM

కాందహార్‌ హైజాక్‌ వల్ల విడుదలై.. ఇప్పుడు దొరికాడు!

జైషే మహమ్మద్ ఉగ్రవాద గ్రూపు స్థాపకుడు, 2001 నాటి పార్లమెంటుపై దాడి సూత్రధారి మసూద్ అజార్‌ గురించి భారత నిఘా, భద్రతా సంస్థలు ఎప్పటినుంచో గాలిస్తున్నాయి. 1999 నాటి కాందహార్ హైజాక్‌ వ్యవహారం ద్వారా తప్పించుకొని పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న మసూద్ అజార్‌ను తమకు అప్పగించాలని భారత్‌ ఎప్పటినుంచో దాయాదిని కోరుతూ వస్తోంది. పఠాన్‌కోట్‌ ఉగ్రవాద దాడి వ్యవహారంలో మసూద్ అజార్‌ను పాక్‌ భద్రతా సంస్థలు నిజంగానే అదుపులోకి తీసుకుంటే.. భారత్‌కు అది పెద్ద విజయమే అవుతుంది. భారత్‌-పాకిస్థాన్‌ చర్చల దిశగా కీలక ముందడుగు పడినట్టు అవుతుంది.

పాకిస్థాన్‌ పంజాబ్‌లోని భవల్‌పుర్‌లో జన్మించిన మసూద్‌ అజార్‌ను మొదట 1994లోనే అరెస్టు అయ్యాడు. తీవ్రవాద కార్యకలాపాల కోసం పోర్చుగీసు నకిలీ పాస్‌పోర్టుతో  కశ్మీర్‌ వచ్చిన అతన్ని అరెస్టు చేసి జైలుకు కూడా తరలించారు. అయితే, 1999లో పాకిస్థాన్‌ ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్‌ చేసి దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్‌ తరలించారు. విమానంలోని 155 మంది ప్రయాణికులు బందీలుగా చిక్కడంతో ఉగ్రవాదుల డిమాండ్ మేరకు జైల్లో ఉన్న మసూద్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను భారత ప్రభుత్వం విడుదల చేసింది. ఉగ్రవాదులకు బందీలుగా చిక్కిన ప్రయాణికులను విడిపించుకుంది. అప్పట్లో కాందహార్ తాలిబన్ అధీనంలో ఉండేది.

కాందహార్‌ నుంచి పాకిస్థాన్ పారిపోయిన అజార్‌ 2001లో భారత పార్లమెంటుపై దాడి వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత తన సహచరుడు ఒమర్ షైక్‌తో కలిసి జమ్ముకశ్మీర్‌లో మిలిటెన్సీని ప్రేరేపించడానికి జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. చాలాకాలంపాటు సొంత ప్రాంతం పంజాబ్‌ ప్రావిన్స్‌లోని భవల్‌పూర్‌లో అజ్ఞాతంలో గడిపిన అజార్‌ను పట్టుకునేందుకు భారత నిఘా, భద్రతా సంస్థలు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాయి. 2014లో మసూద్ పాక్‌లోని ఓ బహిరంగ ర్యాలీలో ఫోన్‌ ద్వారా ప్రసంగించడంతో మళ్లీ వెలుగులోకి వచ్చాడు. జేఈఎం ద్వారా భారత్‌ లక్ష్యంగా అతడు ఉగ్రవాద కార్యకలపాలకు పాల్పడుతున్నాడని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement