స్విస్‌లోని కొన్ని ప్రాంతాల్లో బురఖాపై నిషేధం | Sakshi
Sakshi News home page

స్విస్‌లోని కొన్ని ప్రాంతాల్లో బురఖాపై నిషేధం

Published Fri, Jul 8 2016 7:41 PM

స్విస్‌లోని కొన్ని ప్రాంతాల్లో బురఖాపై నిషేధం

బెర్న్: స్విట్జర్లాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ముఖం కనిపించకుండా బురఖా ధరించడాన్ని స్థానిక ప్రభుత్వం నిషేధించింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానా విధించాలని కూడా నిర్ణయించింది. కనిష్టంగా 7,800 రూపాయలను, గరిష్టంగా 7.85లక్షల రూపాయల జరిమానా విధిస్తూ నూతన చట్టం తీసుకొచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు, ప్రభుత్వ భవనాల్లో ఎవరూ ముఖం కనిపించకుండా బురఖా ధరించకూడదని, జూలై ఒకటవ తేదీ నుంచే ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చిందని స్విడ్జర్లాండ్ ఆగ్నేయ రాష్ట్రమైన టిసినో ప్రభుత్వం ప్రకటించింది.

స్విస్ పర్యటన కోసం మధ్యప్రాచ్య దేశాల నుంచి వచ్చే ముస్లిం మహిళలను ఈ నిషేధ ఉత్తర్వులు ఇబ్బంది పెట్టనున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక సౌదీ అరేబియా దౌత్య కార్యాలయం తమ దేశ పర్యాటకులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. టిసినో ప్రభుత్వ ఉత్తర్వుల గురించి వెల్లడించింది. లుగానో, లొకార్నో, మగదినో, బెల్లింజోన, మెండ్రిసియో ప్రాంతాల్లో ఈ నిషేధ ఉత్తర్వులు అమలవుతాయి.

బురఖాను నిషేధించే విషయమై 2013లోనే టిసినో ప్రభుత్వం రెఫరెండమ్ నిర్వహించింది. మూడింట రెండు వంతుల మంది ఓటర్లు నిషేధానికి అనుకూలంగా ఓటు వేశారు. బురఖాలు, నిఖాబ్‌లతో పాటు ప్రదర్శనల సందర్భంగా ఆందోళకారులు ముఖాలకు గుడ్డలు కట్టుకోవడాన్ని నిషేధించాలని టిసినో ప్రభుత్వం భావించింది. అయితే బురఖాలు, నిఖాబ్‌లు నిషేధిస్తే చాలని ప్రజలు తీర్పు చెప్పారు. ఇలా ఓ రాష్ట్రం బురఖాను నిషేధిస్తూ చట్టం తీసుకరావడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం ఏమీ కాదని కూడా స్విట్జర్లాండ్ పార్లమెంట్ స్పష్టం చేసింది.

విమానాశ్రయాల్లో, కస్టమ్స్ కార్యాలయాల్లో, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో బురఖా నిషేధం గురించి ప్రయాణికులను ముందుగానే హెచ్చరిస్తారు.
 

Advertisement
Advertisement