దక్షిణ కొరియాలో మెర్స్ మరింత తీవ్రతరం | Sakshi
Sakshi News home page

దక్షిణ కొరియాలో మెర్స్ మరింత తీవ్రతరం

Published Sat, Jun 13 2015 10:06 AM

దక్షిణ కొరియాలో మెర్స్ మరింత తీవ్రతరం

సియోల్:  దక్షిణ కొరియాలో ప్రాణాంతక మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ మరింత తీవ్రతరమైంది. శనివారం నాటికి  మరో 12 మెర్స్ కేసుల నమోదు కావడంతో దేశంలోని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో మెర్స్ వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 138కు చేరినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.  వీరిలో ఇప్పటివరకూ 14 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. తాజా మృతుల్లో 67 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి నుంచి మరో నలుగురికి మెర్స్ వైరస్ సంక్రమించినట్లు పేర్కొన్నారు.

వేగంగా విస్తరిస్తున్న మెర్స్ ను నిరోధించే క్రమంలో అధికారులు  దేశంలోని స్కూళ్లను మూసివేశారు. స్థానికులు వీలైనంత వరకూ ఇళ్లల్లోనే గడపాలని, ఒక వేళ బహిరంగ ప్రదేశాలకు వస్తే మాస్క్‌లు ధరించాలని సూచించారు. ఈ వైరస్ తొలుత సౌదీ అరేబియాలో 2012లో వెలుగుచూసింది. కాగా, గడిచిన మంగళవారం నుంచి ఈ వైరస్ శరవేగంగా విస్తరించడానికి కారణాలు తెలుసుకునే క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) బృందం పరిశోధనలు చేస్తోంది. అయితే కొన్ని వారాల తరువాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని డబ్యూహెచ్ఓ టీమ్ తెలిపింది.

Advertisement
Advertisement