Sakshi News home page

భారత్‌కు సంపూర్ణ మద్దతు

Published Fri, Jun 10 2016 2:20 AM

భారత్‌కు సంపూర్ణ మద్దతు - Sakshi

* ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వంపై మెక్సికో స్పష్టీకరణ  
* అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి భారత్ చొరవ భేష్
* మెక్సికోతో సంబంధాల్లో కొత్త శకానికి నాంది: మోదీ
* మోదీని కారులో రెస్టారెంట్‌కు తీసుకెళ్లిన మెక్సికో అధ్యక్షుడు

మెక్సికో సిటీ: అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత సభ్యత్వానికి తమ మద్దతుంటుందని మెక్సికో స్పష్టం చేసింది. గురువారం ప్రధాని మోదీతో విస్తృత చర్చల అనంతరం మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో.. ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వానికి తమ మద్దతుంటుందని ప్రకటించారు.

‘ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వానికి మేం సానుకూలంగా ఉన్నాం. సంపూర్ణ మద్దతు తెలుపుతాం. ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర నిరోధకత తెచ్చేందుకు అంతర్జాతీయ ఎజెండా రూపకల్పనలో మోదీ ఆలోచనతో ఏకీభవిస్తున్నాం. అందుకే భారత్‌కు నిర్మాణాత్మక మద్దతిచ్చేందుకు సుముఖంగా ఉన్నాం’ అని ఎన్రిక్ పెనో టీటా తెలిపారు. మద్దతు తెలిపినందుకు మెక్సికో అధ్యక్షుడికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఐదురోజుల ప్రధాని విదేశీ పర్యటనలో ఎన్‌ఎస్‌జీలో కీలకమైన అమెరికా, స్విట్జర్లాండ్, మెక్సికో దేశాల నుంచి  భారత అభ్యర్థిత్వానికి మద్దతు లభించింది.
 
ద్వైపాక్షిక సంబంధాలపై..
ప్రధాని మోదీ, మెక్సికో అధ్యక్షుడి మధ్య జరిగిన సమావేశంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సమాచార సాంకేతికత, శక్తి, అంతరిక్ష పరిశోధన అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా పలు అంశాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో సంస్కరణలకు పట్టుబట్టడంతోపాటు ఉగ్రవాదం, వాతావరణ మార్పులు వంటి అంశాలపైనా ఇరుదేశాల నేతలు చర్చించారు.

అంతర్జాతీయ అంశాలపై చర్చలు.. భారత్-మెక్సికో సంబంధాలు మరింత బలోపేతమయ్యేందుకు దోహదపడతాయని భావిస్తున్నట్లు మోదీ వెల్లడించారు. ఐటీ, శక్తి, ఫార్మా, అటోమొబైల్ పరిశ్రమలు, అంతరిక్ష, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దీర్ఘకాల సంబంధాలు, పరస్పర సహకారానికి అంగీకరించారని మోదీ తెలిపారు. అంతర్జాతీయ సౌరశక్తి కూటమికి ఎన్రిక్ మద్దతు తెలిపారన్నారు. వచ్చే ఏడాది మెక్సికోలో జరగనున్న ఏడో భారత్-మెక్సికో సంయుక్త కమిషన్ సమావేశంలో ఇరుదేశాల విదేశాంగ మంత్రులు వ్యూహాత్మక భాగస్వామ్యంపై రోడ్ మ్యాప్‌ను రూపొందిస్తారని నిర్ణయించారు. అధ్యక్షుడు ఎన్రిక్‌కూడా వివిధ అంతర్జాతీయ అంశాల పరిష్కారానికి భారత్ తీసుకుంటున్న చొరవను అభినందించారు. గత డిసెంబర్లో జరిగిన పారిస్ ఒప్పందం రూపకల్పనలో భారత్ పాత్ర క్రియాశీలకమని ప్రశంసించారు.
 
‘వెజిటేరియన్’ బంధం
అనంతరం మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో, ప్రధాన మంత్రి కలసి కారులో మెక్సికో సిటీలోని ఓ వెజ్ రెస్టారెంటుకు వెళ్లారు. ఎన్రిక్ స్వయంగా కారు నడిపారు. ఈ చిత్రాలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు. అంతకుముందు అమెరికా పర్యటన ముగించుకుని మెక్సికో వచ్చిన మోదీకి.. అధ్యక్షుడు ఎన్రిక్ ట్విట్టర్లో స్వాగతం పలికారు. అనంతరం ఐదుదేశాల పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ భారత్‌కు తిరుకు పయనమయ్యారు. ‘భారత, మెక్సికో దేశాల మధ్య బంధాల మధ కొత్త శకానికి తెరలేచింది. థ్యాంక్యూ మెక్సికో’ అని మోదీ ట్వీట్ చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement