మకరి కన్య.. మేయర్ వరుడు | Sakshi
Sakshi News home page

మకరి కన్య.. మేయర్ వరుడు

Published Sun, Jul 5 2015 7:53 AM

మకరి కన్య.. మేయర్ వరుడు

ప్రకృతి కరుణ కోసం ఆయా దేశాల్లో రకరకాల ఆచారాలు పాటిస్తుంటారు. అలాంటిదే ఈ మొసలి వివాహం కూడా. మెక్సికో తీరప్రాంత నగరం శాన్ పెడ్రో హామెలులాకు మేయర్ అయిన జియోల్ వాకెజ్ రోజస్ ఇటీవల ఇలా మూడేళ్ల మకరి యువరాణి మరియా ఇసాబెల్‌ను అట్టహాసంగా మనువాడారు.

సంప్రదాయ దుస్తులు, మూతి చుట్టూ ప్లాస్టర్ టేప్‌ను ధరించి(ఎంతైనా మకరి కదా.. అలవాటులో పొరపాటుగా దాడి చేస్తుందని ఈ జాగ్రత్త తీసుకుని ఉంటారు!) యువరాణి మరియా పెళ్లికి విచ్చేసింది. అతిథులు, ప్రజల సమక్షంలో మరియాకు క్రైస్తవ పెద్దలు బాప్తిస్మం ఇచ్చారు.  అనంతరం పెళ్లి వేడుక మొదలైంది. భార్య, కుమారుడి సహితంగా వచ్చిన వరుడు రోజస్, వధువు మరియా పెళ్లి వాగ్దానాలు ఇచ్చిపుచ్చుకున్నారు. నూతన వధూవరులు కలసి నృత్యం చేశారు.

నగర మేయర్ ఇలా ఏటా ఓ యువరాణి(మొసలి వధువు)ని వివాహమాడితే మత్స్య సంపద బాగా వృద్ధి చెంది తమకు చేపలు, రొయ్యలు సమృద్ధిగా లభిస్తాయన్నది ఇక్కడి వారి విశ్వాసం. అయితే, ఈ యువరాణిని ఎక్కడి నుంచి తెచ్చారు? ఇంతకుముందు మనువాడిన మకరి రాణులు ఏమయ్యారు? నూతన రాణి భవితవ్యం ఏమిటి? అన్న వివరాలు అడగొద్దు. ఎందుకంటే ఇదంతా రహస్యం!

Advertisement
Advertisement