‘సర్జికల్‌’ను ఎవరూ తప్పుబట్టలేదు! | Sakshi
Sakshi News home page

‘సర్జికల్‌’ను ఎవరూ తప్పుబట్టలేదు!

Published Tue, Jun 27 2017 12:31 AM

‘సర్జికల్‌’ను ఎవరూ తప్పుబట్టలేదు! - Sakshi

సార్వభౌమత్వం కాపాడుకునేందుకు ఏమైనా చేయగలం
► మూడేళ్లలో ఒక్క అవినీతి మరక లేకుండా పాలన
►  విదేశాల్లో ఉంటున్న భారతీయుల కలలు సాకారం చేస్తాం
► భారత అమెరికన్లకు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా  


వాషింగ్టన్‌: పాకిస్తాన్‌పై గతేడాది జరిపిన సర్జికల్‌ దాడులపై ప్రపంచాన్ని ఒప్పించటంలో భారత్‌ విజయవంతమైందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్ల డించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని దోషులుగా నిలబెట్టడంలో అనుకున్నది సాధించగలిగామన్నారు. వర్జీనియాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భారతీయ అమెరికన్లనుద్దేశించి భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధాని మోదీ ప్రసంగించారు.

పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రకేంద్రాలపై సెప్టెంబర్‌ 29న భారత ఆర్మీ జరిపిన సర్జికల్‌ దాడులపై.. ఒక్కదేశం కూడా మనల్ని తప్పబట్టలేదని గుర్తుచేశారు. ఆనాటి దాడులు తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు భారత్‌ ఏమైనా చేయగలదని నిరూపించాయని 600 మందికిపైగా ఆహూతులనుద్దేశించి ప్రధాని తెలిపారు. ‘20 ఏళ్ల క్రితం ఉగ్రవాదం గురించి మనం మాట్లాడినపుడు చాలా దేశాలు దీన్ని అర్థం చేసుకోకుండానే శాంతిభద్రతల సమస్యగా పేర్కొన్నాయి.

కానీ ఇప్పుడు ఉగ్రవాదులే వారికి ఉగ్రవాదాన్ని అర్థం చేయించారు. మనమేమీ చేయలేదు’ అని ప్రపంచదేశాల్లో ఇటీవల పెరిగిన ఉగ్రఘటనలను ఉటంకిస్తూ మోదీ వ్యాఖ్యానించారు. ‘అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండటమే భారత్‌ విధానం. వసుధైక కుటుంబం (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే సూత్రాన్ని భారత్‌ విశ్వసిస్తుంది. ఇదే మా స్వభావం, వ్యక్తిత్వం’ అని మోదీ తెలిపారు. భారత సార్వభౌమత్వానికి, భద్రతకు, దేశ ప్రజల శాంతి, అభివృద్ధికి అడ్డుగా నిలిస్తే ఎవరిపైనైనా కఠినంగా వ్యవహరించటంలోనూ వెనుకాడేదిలేదని స్పష్టీకరణ.

సుష్మపై ప్రశంసలు
దౌత్యవిధానానికి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ కొత్త నిర్వచనం చెప్పారని ప్రధాని ప్రశంసించారు. సామాజిక మాధ్యమాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని సుపరిపాలన అందించటంలో సుష్మ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రపంచం నలుమూలల ఇబ్బందుల్లో ఉన్న భారతీయులను ఆమె ఆదుకుంటున్నారని పొగడ్తల వర్షం కురిపిం చారు. ‘సామాజిక మాధ్యమం చాలా శక్తివంతమైంది.

నేను కూడా దీంతో అనుసంధానితమయ్యా ను. కానీ సుష్మా స్వరాజ్‌ సామాజిక మాధ్యమం వినియోగంలో ఉదాహరణగా నిలిచారు. సమస్యల్లో ఉన్నామని ట్వీట్‌ చేస్తే అర్ధరాత్రి 2గంటలకైనా సరే 15 నిమిషాల్లోనే సమాధానం ఇస్తున్నారు. వేగంగా స్పందించి వారిని కాపాడుతున్నారన్నారు’ అని తెలిపారు. దీంతో సభ కరతాళధ్వనులతో మార్మోగింది. మూడేళ్లలో 80వేల మంది భారతీయులను (వివిధ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని) సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చినట్లు మోదీ వెల్లడించారు. ఈ మూడేళ్లలో తమ ప్రభుత్వంపై ఒక్క అవినీతి మరకా లేదన్నారు. అవినీతిని పెకలించివేసేందుకు తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు.

‘పాలనలో సాంకేతిక పద్ధతుల వినియోగంతో లీకేజీలను అరికడుతున్నాం. ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే డబ్బులు వెళ్తున్నాయి. ఒక్క పిలుపుతోనే లక్షల మంది తమ సిలిండర్‌ సబ్సిడీలను వదులుకున్నారు. ఆ డబ్బులతో పేదలకు ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నాం’ అని ప్రధాని పేర్కొన్నారు. అంతకుముందు, సీఈవోలతో జరిగిన సమావేశంలో.. సుందర్‌ పిచాయ్, టిమ్‌కుక్, జెఫ్‌ బెజోస్‌ వంటి బడా కంపెనీల సారథులు మాట్లాడుతున్నప్పుడు వారి ప్రసంగాల్లోని ముఖ్యాంశాలను మోదీ వివరంగా నోట్‌ చేసుకున్నారు. జీఎస్టీని ఎలా అమలుచేస్తారనేది చాలా కీలకం, అత్యంత కష్టమని గూగుల్‌ సీఈఓ పిచాయ్‌ వ్యాఖ్యానించారు.

మోదీ – ట్రంప్‌ భేటీలో ‘హెచ్‌1బీ’!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రధాని నరేంద్ర మోదీతో శ్వేతసౌధంలో తొలిసారిగా భేటీకానున్నారు. వ్యూహాత్మక అంశాలపై వ్యక్తిగతంగా వీరిద్దరూ విస్తృతమైన చర్చలు జరపనున్నారు. ఉగ్రవాదం, వాణిజ్యం సహా పరస్పర ప్రయోజనాలున్న అంశాలపై వీరు మాట్లాడుకోనున్నారు. వీరి భేటీ సందర్భంగా హెచ్‌1బీ వీసాల అంశంకూడా చర్చకు రానుందని సమాచారం.

వ్యక్తిగతంగా, తమ తమ బృందాలతో కలిసి వీరిద్దరి సమావేశం నాలుగున్నరగంటలకు పైగా సాగనుందని వైట్‌హౌజ్‌ వర్గాలు వెల్లడించాయి. ‘వీరిద్దరి భేటీలో ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలు, ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో రక్షణ భాగస్వామ్యం, వాణిజ్యం, చట్టాల అమలు, శక్తి తదితర రంగాల్లో పరస్పర సహకారంపై చర్చిస్తారు’ అని శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ సీన్‌ స్పైసర్‌ వెల్లడించారు.

ట్రంప్‌ దంపతుల స్వాగతంతో మొదలై..
అధ్యక్షుడు ట్రంప్‌తోపాటుగా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ కూడా మోదీకి స్వాగతం పలకనున్నారు. అనంతరం ఓవల్‌ కార్యాలయంలో వీరిద్దరూ కాసేపు వ్యక్తిగతంగా భేటీ అవుతారు. అనంతరం తమ డెలిగేషన్స్‌తో కలిసి కేబినెట్‌ రూమ్‌లో మళ్లీ చర్చలు జరపనున్నారు. ఈ కార్యక్రమంలో మోదీతోపాటుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, విదేశాంగ కార్యదర్శి ఎస్‌ జైశంకర్, అమెరికాలో భారత రాయబారి నవ్‌తేజ్‌ సర్నాతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

అమెరికా తరపున ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్, రక్షణ కార్యదర్శి జేమ్స్‌ మాటిస్, విదేశాంగ కార్యదర్శి రెక్స్‌ టిల్లర్‌సన్‌ తదితరులు హాజరుకానున్నారు. అనంతరం రోజ్‌ గార్డెన్‌లో సంయుక్త మీడియా సమావేశంలో మోదీ–ట్రంప్‌ పాల్గొననున్నారు. అనంతరం శ్వేతసౌధంలోని చారిత్రక భవనం బ్లూ రూమ్‌లో మోదీతోపాటుగా భారత బృందం విందులో పాల్గొననున్నారు. అనంతరం మోదీ నెదర్లాండ్స్‌కు పయనమవుతారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement