మనం కక్కితే వారొచ్చి క్లీన్ చేస్తారు! | Sakshi
Sakshi News home page

మనం కక్కితే వారొచ్చి క్లీన్ చేస్తారు!

Published Wed, Jun 8 2016 6:01 PM

మనం కక్కితే వారొచ్చి క్లీన్ చేస్తారు!

వీకెండ్ పార్టీలు ఎంత చెత్తా చెదారాన్ని మిగులుస్తాయో, ఇల్లెంత గజిబిజిగా, గందరగోళంగా కనిపిస్తుందో తెల్లారితే గానీ మనకు తెలియదు. ఇక మద్యం పార్టీల సంగతి చెప్పనక్కర్లేదు. ఎటూ చూసినా పగిలిన సీసాల గాజుపెంకులు, పాడైపోయిన ఆహారం నుంచి వెలువడే కంపు వాసన, మందెక్కువై ఎవరైనా వాంతులు చేసుకుంటే చూసిన మనకు డోకులు వచ్చే పరిస్థితి. పీకలదాకా తాగిన మద్యం ప్రభావంతో తల తిరుగుతుంటే ఇల్లెలా శుభ్రం చేసుకోవాలో, ఆఫీసుకెలా రెడీ అవ్వాలో తెలియక తికమకపడే వారికో శుభవార్త.

కచ్చితంగా ఇలాంటి పార్టీల కోసమే ఏర్పాటైంది ఓ సర్వీసు సంస్థ. ఆ సంస్థ పేరు 'మార్నింగ్-ఆఫ్టర్ మెయిడ్స్'. న్యూజిలాండ్‌లో ఇద్దరు మహిళలు ఏర్పాటుచేసిన ఈ సరికొత్త వ్యాపార సర్వీసుసంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఫ్రాంచైజీల కోసం పలు దేశాల నుంచి పోటీపడుతున్నారు. ఈ సంస్థ ఉద్యోగులు లేదా పనిమనుషులు మనం ఫోన్ చేసిన తక్షణమే మన ఇంటి ముందు వాలిపోతారు.

చిటికెలో ఇల్లంతా శుభ్రం చేస్తారు. పగిలిన సీసాలను, గ్లాసు ముక్కలను జాగ్రత్తగా శుభ్రం చేస్తారు. పాడైపోయిన ఆహారాన్ని మున్సిపల్ తొట్లలో పడేస్తారు. మన ఇళ్లలో పనిచేసే మామూలు పనిమనుషుల్లా కాకుండా వీరు ఏ వస్తువును ఎక్కడుంచాలో సృజనాత్మకంగా వ్యవహరిస్తారు. ఇంటి యజమానులు ఆఫీసుకు ఆలస్యం కాకుండా వేడినీళ్లను కాచి పెడతారు. బట్టలను సర్దిపెడతారు. పార్టీ హ్యాంగోవర్ దిగేందుకు చక్కటి కాఫీ లేదా మద్యం పెగ్గు కలిపిస్తారు. టిఫిన్ లేదా భోజనం కూడా వండిపెడతారు. మన మూడ్‌ను బట్టి అవసరమైతే నచ్చిన సంగీతం కూడా వినిపిస్తారు. తిని పడేసిన మాంసం ముక్కలు వృధా కాకుండా కొన్నిసార్లు తర్ఫీదు పొందిన కుక్కల్ని కూడా తీసుకొస్తారు. అందించే సర్వీసులను బట్టి చార్జీలు కొంచెం అటు ఇటూ మారినా ఇల్లు వైశాల్యం, గంటల చొప్పునే చార్జీలు వసూలు చేస్తారు. పార్టీ సైజును బట్టి వెయ్యి నుంచి నాలుగు వేల రూపాయలను వసూలు చేస్తారు. అదనంగా గంటకు 1500 రూపాయలు చార్జి చేస్తారు. వాంతులు చేసుకుంటే అదనపు చార్జీలు వర్తిస్తాయి.

న్యూజిలాండ్లోని ఆక్లాండ్‌లో నివసిస్తున్న రెబెక్కా ఫోలే, కేథరిన్ అషర్స్ట్ అనే ఇద్దరు రూమ్మేట్స్ కలిసి ఈ సరికొత్త సర్వీసు సంస్థను ఇటీవలే ఏర్పాటుచేశారు. ఓ రోజు తమ ఇంట్లో పార్టీ జరిగిన తెల్లారి నిద్రలేచాక చూస్తే అంతా చెత్తచెత్తగా, గందరగోళంగా కనిపించిందని, అబ్బా, ఎవరైనా వచ్చి ఇల్లు శుభ్రం చేస్తే బాగుండునని పించిందని, ఆ ఆలోచన నుంచే ఈ సంస్థ పుట్టుకొచ్చిందని రెబెక్కా మీడియాకు తెలిపారు. ఈ ఆలోచన గురించి ఫేస్‌బుక్‌లో మిత్రులతో చర్చించగా, అందరినుంచి సానుకూల స్పందన లభించిందని చెప్పారు. ఈ సంస్థ గురించి మీడియాలో కూడా విస్తృత ప్రచారం కావడంతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. పలు దేశాల నుంచి ఇలాంటి సర్వీసుల కోసం ఫ్రాంచైజీలకు ప్రతిపాదనలు వస్తున్నాయని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తమకు ఇంతకుముందు ఎలాంటి వ్యాపారానుభవం లేదని చెప్పారు. అయితే వ్యాపార దృక్పథంతో పాటు సేవా దృక్పథం దెబ్బతినకుండా ఈ వ్యాపారాన్ని మరింత ఎలా మెరగుపర్చవచ్చునో సలహాలిస్తే స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆమె చెప్పారు.

 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement