అఫ్గానిస్తాన్‌ మసీదులో భారీ పేలుడు | Sakshi
Sakshi News home page

అఫ్గానిస్తాన్‌ మసీదులో భారీ పేలుడు

Published Sat, Oct 19 2019 3:00 AM

Mosque bombing kills 62 people in eastern Afghanistan - Sakshi

జలాలాబాద్‌: శుక్రవారం ప్రార్థనల సందర్భంగా మసీదులో జరిగిన ఒక భారీ పేలుడులో 62 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు అఫ్గానిస్తాన్‌లోని నన్ఘఢార్‌ రాష్ట్రంలో, జలాలాబాద్‌కు 50 కి.మీ.ల దూరంలోని హస్కమినలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి మసీదు పై కప్పు కూలిపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారన్నారు. 36 మంది గాయపడ్డారని, వారిని జలాలాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించామని చెప్పారు. ఇది ఆత్మాహుతి దాడేనా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదన్నారు.

ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే, తూర్పుఅఫ్గానిస్తాన్‌లో తాలిబన్, అల్‌కాయిదా ఉగ్రసంస్థలు చురుకుగా ఉన్నాయి. అఫ్గానిస్తాన్‌లో హింస తారస్థాయికి చేరిందంటూ ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక విడుదల చేసిన మర్నాడే ఈ దాడి జరిగింది. ఈ జూలైలో గతమెన్నడూ లేనంత హింస చోటు చేసుకుందని, ఐరాస గణాంకాలు సేకరించడం ప్రారంభించిన తరువాత, ఒక నెలలో హింసాత్మక ఘటనల్లో అత్యధిక సంఖ్యలో పౌరులు మరణించడం ఈ జూలైలోనేనని ఐరాస ఆ నివేదికలో పేర్కొంది.   

Advertisement
Advertisement