కాశ్మీర్ విషయంలో అమెరికా జోక్యం అవసరం: షరీఫ్ | Sakshi
Sakshi News home page

కాశ్మీర్ విషయంలో అమెరికా జోక్యం అవసరం: షరీఫ్

Published Sun, Oct 20 2013 9:18 PM

కాశ్మీర్ విషయంలో అమెరికా జోక్యం అవసరం: షరీఫ్

ఇస్లామాబాద్: కాశ్మీర్ సమస్య పరిష్కారానికి అమెరికా జోక్యం అవశ్యమని పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ అభిప్రాయపడ్డారు. కాశ్మీర్‌పై మూడో (అమెరికా) దేశం జోక్యం చేసుకోవడం భారత్‌కు ఇష్టం లేనప్పటికీ, సమస్య పరిష్కారం కావాలంటే అగ్ర దేశం జోక్యం అవసరమేనన్నారు. బుధవారం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలుసుకోవడానికి బయల్దేరి వెళుతున్న నవాజ్ లండన్‌లో ఆదివారం ఈ వ్యాఖ్య చేశారు.

భారత్, పాకిస్థాన్‌ల వద్ద అణ్వాయుధాలున్నాయని, ఇది అణ్వాయుధ అలికిడి కలిగిన ప్రాంతమని ఆయన అన్నారు. అమెరికా జోక్యంతోనే కాశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందన్న విషయాన్ని 1999 జూలైలో కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడే అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు తాను స్పష్టం చేశానని ఒక ప్రశ్నకు బదులుగా నవాజ్ షరీఫ్ చెప్పారు. కానీ, ఉభయ దేశాలూ నిర్మాణాత్మక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా చెబుతూ వస్తోందన్నారు. అయితే, 60 ఏళ్లుగా అడుగుముందుకు పడలేదని చెబుతూ.. భారత్, పాకిస్థాన్ మధ్య అంతూ దరీ లేని ఆయుధ పోటీ ప్రమాదకర స్థితికి చేరిందన్నారు. దీన్ని ఎక్కడో ఒకచోట ఆపాలన్నారు. అమెరికా డ్రోన్ దాడుల గురించి కూడా ఒబామా దష్టికి తెస్తానన్నారు.

 ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో గత నెలలో తాను కాశ్మీర్ అంశంపై ఆందోళన వెలిబుచ్చినప్పుడు ప్రపంచం అంతా హర్షించిందని చెప్పుకున్నారు. ఐరాస సమావేశానికి వెళ్లి వస్తూ నవాజ్ న్యూయార్క్‌లోనూ పర్యటించినప్పటికీ, పాకిస్థాన్ ప్రధాని అమెరికాలో అధికారిక పర్యటన జరపడం గత ఐదేళ్లలో ఇదే ప్రథమం.

Advertisement
Advertisement