Sakshi News home page

ఆకాశ దేశం

Published Fri, Oct 14 2016 3:29 AM

ఆకాశ దేశం - Sakshi

వినడానికి కొంచెం ఆశ్చర్యకరంగా, విచిత్రంగానూ అనిపించే వార్త ఇది. ఈ భూమండలాన్ని గ్రహశకలాల నుంచి రక్షించేందుకు అంతరిక్షంలోనే ఓ సరికొత్త ‘దేశాన్ని’ ఏర్పాటు చేస్తామంటోంది ఓ బహుళజాతి కంపెనీ. వచ్చే ఏడాది ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించడంతో ఈ ‘ఆకాశదేశం’ నిర్మాణం మొదలవుతుందని ఆ తరువాత దశలవారీగా దీన్ని లక్ష మందికి నివాస యోగ్యంగా మారుస్తామని ప్రకటించింది ఏరోస్పేస్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్. ప్యారిస్‌లో ఈ సంస్థ అధిపతి డాక్టర్ ఇగోర్ అషుర్‌బెయిలీ ఇందుకు సంబంధించిన ప్రణాళికలను విడుదల చేశారు. వాటి ప్రకారం... ఈ ఆకాశదేశం పేరు అస్‌గార్డియా! యూరప్‌లోని నార్వీజియన్ ప్రాంతంలోని గాథల్లో ప్రముఖంగా వినిపించే పేరు ఇది. హాలీవుడ్ సినిమాలు, థోర్, అవెంజెర్స్‌లోనూ ఇదే పేరుతో ఓ దేశం ఉంటుంది.

అంతరిక్షంలో పాడైపోయినా, వినియోగంలో లేని ఉపగ్రహాలు, రాకెట్ల విడిభాగాలు స్వేచ్ఛగా తిరుగుతున్న విషయం మీకు తెలుసుకదా... ఇవి ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న ఉపగ్రహాలకు పెద్ద విపత్తుగా మారాయి. గంటకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ చెత్త... ఏ ఉపగ్రహాన్ని ఢీకొన్నా అందులోని వ్యవస్థలన్నీ నాశనమైపోతాయి. నేలపైకి జారి పడినా ముప్పే. ఇలాంటి ప్రమాదాలను తప్పించేందుకు, సుదూర అంతరిక్షం నుంచి దూసుకొచ్చే గ్రహశకలాలు భూమిని ఢీకొనకుండా చూసేందుకు అస్‌గార్డియా పనిచేస్తుందని ఇగోర్ అంటున్నారు. వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఈ ఆకాశదేశంలో ఎవరైనా పౌరులుగా మారవచ్చునని, అయితే లక్ష మందికి మాత్రమే ప్రవేశం ఉంటుందని అంటున్నారు ఆయన. ఇది వాస్తవ రూపం దాలుస్తుందో లేదో తెలియదుగానీ.. వినడానికి మాత్రం భలే ఉందీ ఐడియా!

 

Advertisement

తప్పక చదవండి

Advertisement