కంప్యూటర్‌ ప్రోగామర్లకు అమెరికా ఉద్యోగాలిక రావా? | Sakshi
Sakshi News home page

కంప్యూటర్‌ ప్రోగామర్లకు అమెరికా ఉద్యోగాలిక రావా?

Published Tue, Apr 4 2017 8:32 PM

కంప్యూటర్‌ ప్రోగామర్లకు అమెరికా ఉద్యోగాలిక రావా? - Sakshi

హెచ్‌–1బీ వీసాపై ‘పాలసీ గైడెన్స్‌’ పిడుగు

తాత్కాలిక ప్రాతిపదికన తనకు నైపుణ్యమున్న రంగంలో పనిచేయడానికి అర్హతలున్న విదేశీయుడు అమెరికాలో ప్రవేశించడానికి ఉపకరించే సాధనమే హెచ్‌1బీ వీసా. నిపుణుల కొరత ఉంటే, ఆ లోటు భర్తీకి ఇతర దేశాల నుంచి కార్మికులను కంపెనీలు ఈ వీసాల ద్వారా రప్పించడం 1990లో ఆరంభమైంది. అంతకు ముందు విశిష్ట ప్రతిభాపాటవాలు, సామర్ధ్యం ఉన్న విదేశీయులు అమెరికాలో పనిచేయడానికి హెచ్‌1 వీసాతో వచ్చేవారు. స్థానిక కార్మికుల ప్రయోజనాలు కాపాడడానికి అవసరమైన మార్పులు చేసి హెచ్‌1 స్థానంలో హెచ్‌1బీ వీసాను 27 ఏళ్ల క్రితం అమెరికా ప్రవేశపెట్టింది. ఈ వీసాలకు 65, 000 వార్షిక గరిష్ట పరిమితి విధించారు. ఈ వీసా గడువు మూడేళ్లు. మరో మూడేళ్లు పొడిగించవచ్చు.

ఆరేళ్ల గడువు ముగిశాక మరోసారి నాన్‌ ఇమిగ్రంట్‌ వీసాకు దరఖాస్తు చేయడానికి అర్హత సాధించకపోయినా, చట్టపరమైన శాశ్వత నివాసానికి(గ్రీన్‌కార్డు) అప్లయ్‌చేసుకోవడానికి అర్హత సాధించకపోయినాగాని వెంటనే అమెరికా విడిచిపోవాల్సి ఉంటుంది. ఇలా వెళ్లిపోయినా వ్యక్తులు(కార్మికులు) ఇతర దేశాల్లో ఏడాది కాలం గడిపాక మళ్లీ అమెరికాలో ప్రవేశించడానికి హెచ్‌1బీ వీసాకు దరఖాస్తుచేసుకోవచ్చు. ప్రంపంచీకరణ ప్రక్రియ వేగం పుంజుకుని, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విప్లవం వచ్చాక అమెరికాలో ఐటీ నిపుణుల(కార్మికులు) అవసరం బాగా పెరిగింది. దీంతో 1990లో ఈ వీసా ప్రవేశపెట్టినప్పటి నుంచీ కంప్యూటర్‌ రంగానికి సంబంధించినవారే మొత్తం వీసాల్లో సగానికిపైగా సాధించి అమెరికాలో పనిచేయడం, తర్వాత గ్రీన్‌కార్డు సంపాదించడం ఇప్పటి వరకూ జరుగుతున్న వ్యవహారమే.

కంప్యూటర్‌ పరిశ్రమ లాబీయింగ్‌తో పెరిగిన గరిష్ట పరిమితి!
ఐటీ విప్లవం ఫలితంగా కంప్యూటర్‌ రంగంలో పనిచేసే సిబ్బంది అవసరం విపరీతంగా అమెరికాలో పెరగడంతో అక్కడి కంప్యూటర్‌ పరిశ్రమ నేతలు లాబీయింగ్‌ చేసి 1998లో హెచ్‌1బీ వీసాల వార్షిక గరిష్ట పరిమితిని 1,15,000కు పెంచేలా చేశారు. అంతేగాక, ఈ వీసా కార్యక్రమం కింద వచ్చే సిబ్బంది కుటుంబసభ్యులకు(డిపెండెంట్లు) ఉద్యోగాలిచ్చే కంపెనీలు స్థానిక అమెరికన్లను పనిలో పెట్టుకోవడంతోపాటు ఈ డిపెండెంట్ల నియామకం వల్ల స్థానికులను ఉద్యోగాలు తొలగించలేదనీ, విదేశీ సిబ్బంది కోసం హెచ్‌1బీ వీసాలు కోరే ముందు స్థానికసిబ్బదిని ఇంటికి పంపబోమని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చేలా చట్టంలో మార్పులు చేశారు.
(చదవండి: హెచ్1బీ వీసాలపై ట్రంప్ ఉక్కుపాదం!)

 

2000 సంవత్సరం నాటికి ఐటీ రంగంలో పెరిగిన అవసరాల దృష్ట్యా ఈ వీసాల గరిష్ట పరిమితిని 1,95,000కి పెంచేచేశారు. పెంచిన పరిమితి గడువు 2003లో ముగిసింది. 2004 హెచ్‌1బీ వీసా సంస్కరణ చట్టం ద్వారా పరిమితిని 65, 000కు తగ్గించారు. అయితే, అమెరికా విద్యాసంస్థ నుంచి మాస్టర్స్‌ yì గ్రీ పొందిన విదేశీ నిపుణుల కోసం మరో  20 వేల కొత్త వీసాలు రిజర్వ్‌చేశారు. అప్పటి నుంచి మొన్న జనవరిలో డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష పదవిని చేపట్టే వరకూ ఈ వీసా కార్యక్రమంలో ఎలాంటి మార్పులు చేయలేదు.

మొదట్నించీ అత్యధిక హెచ్‌1బీ వీసాలు భారతీయులకే!
కంప్యూటర్‌ లేదా ఐటీ ఆధారిత సేవల రంగాల్లో పనిచేసే నైపుణ్యం, శిక్షణ ఉన్న సిబ్బంది ఇండియాలో ఎక్కువ ఉండడంతో అమెరికాలోని ఈ పరిశ్రమలో భారతీయులకే భారీ అవకాశాలు వచ్చాయి. సిలికాన్‌ వ్యాలీ కంపెనీల్లో పనిచేసే ఉన్నతస్థాయి కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ నిపుణుల నుంచి అమెరికాలో సేవలందించే భారత ఐటీ కంపెనీల తరఫున అక్కడ ప్రోగ్రామర్‌గా పనిచేసే అవకాశాలూ భారతీయులకే ఎక్కువ లభించాయి. ఇప్పటికీ లభిస్తున్నాయి. భారతదేశంలో పుట్టిపెరిగినవారికి 2015లో మొత్తం హెచ్‌1బీ వీసాల్లో 71 శాతం దక్కాయి.

తర్వాత స్థానం చైనాది (పది శాతం). సగానికి పైగా ఈ వీసాలు కంప్యూటర్‌రంగంలోని సిస్టమ్స్‌ అనలిస్ట్స్, ప్రోగ్రామింగ్, కంప్యూటర్‌ సంబంధిత విభాగాల్లో పనిచేసేవారికే జారీ అవుతున్నాయి. ప్రవేశ స్థాయి కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌ ఉద్యోగాలు చేసేవారికి ఈ వీసా దక్కకుండా మార్పులు చేస్తూ మార్చి 31న ఉత్తర్వులు జారీ చేసినా వాటిని అమలు చేయడంలో చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారు. వీసాల జారీలో కీలకపాత్ర పోషించే అమెరికా సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ ఇంత ఆలస్యంగా  ‘పాలసీ గైడెన్స్‌’ పేరుతో తెచ్చిన మార్పు కోర్టుల పరిశీలనకు నిలవదని చెబుతున్నారు.

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

Advertisement

తప్పక చదవండి

Advertisement