అమెరికా విదేశాంగ మంత్రిగా ఎన్నారై మహిళ! | Sakshi
Sakshi News home page

అమెరికా విదేశాంగ మంత్రిగా ఎన్నారై మహిళ!

Published Thu, Nov 17 2016 9:10 AM

అమెరికా విదేశాంగ మంత్రిగా ఎన్నారై మహిళ! - Sakshi

వాషింగ్టన్‌: భారత​-అమెరికన్‌ మహిళ నిక్కీ హేలీకి డొనాల్డ్‌ ట్రంప్‌ మంత్రివర్గంలో కీలక పదవి దక్కే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఆమెకు ప్రాధాన్యమున్న మంత్రి పదవి(హై ప్రొఫైల్‌ పోస్ట్‌) కట్టబెట్టేందుకు ట్రంప్‌ సముఖంగా ఉన్నారని స్థానిక మీడియా పేర్కొంది. హేలీ ఈరోజు ట్రంప్‌ తో భేటీ అవుతారని అధ్యక్ష అధికార బదలాయింపు బృందం ప్రతినిధి సీన్‌ స్పైసర్‌ తెలిపారు.

ఆమెతో పాటు మాజీ మంత్రి హెన్సీ కిస్సింగర్‌, రిటైర్డ్‌ జనరల్‌ జాన్‌ కీనే, అడ్మిరల్‌ మైక్‌ రోజర్స్‌, కెన్‌ బ్లాక్‌ వెల్‌ కూడా ట్రంప్‌ ను కలవనున్నారని వెల్లడించారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఆయనను ప్రతిరోజు ఎంతోమంది కలుస్తున్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్న వారు ట్రంప్‌ కు తమ విన్నపాలు విన్నవించుకుంటున్నారు. సూచనలు, సలహాలు ఇచ్చేందుకు కొంతమంది వస్తున్నారు.

44 ఏళ్ల నిక్కీ హేలీ రెండో పర్యాయం దక్షిణ కరోలినా రాష్ట్రానికి రెండో పర్యాయం గవర్నర్‌ గా వ్యవహరిస్తున్నారు. ఆమె​కు విదేశాంగ మంత్రి దక్కే అవకాశముందని ట్రంప్‌ సన్నిహితడొకరు వెల్లడించారు. మరో ఇండియన్‌-అమెరికన్‌ బాబీ జిందాల్‌ కూడా కేబినెట్‌ రేసులో ఉన్నారు. రెండో పర్యాయం లూసియానా గవర్నర్‌ గా పనిచేస్తున్న ఆయనను ఆరోగ్యశాఖ మంత్రిగా నియమించే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిక్కీ హేలీ, జిందాల్‌.. ట్రంప్ కేబినెట్‌లో స్థానం దక్కితే ఆ పదవి పొందిన తొలి భారతీయ అమెరికన్లు రికార్డులకెక్కుతారు.

Advertisement
Advertisement