హెచ్‌1 బీ వీసాలపై పరిమితులు లేవు..! | Sakshi
Sakshi News home page

హెచ్‌1 బీ వీసాలపై పరిమితులు లేవు..!

Published Fri, Sep 15 2017 10:33 AM

హెచ్‌1 బీ వీసాలపై పరిమితులు లేవు..! - Sakshi

న్యూఢిల్లీ:  హెచ్‌1బీ వీసాల జారీ విషయంలో ఆందోళనపై  భారతీయులకు భారీ ఊరట కలగనుంది. హెచ్‌1 బీ వీసాలపై ఎలాంటి పరిమితులు ఆంక్షలు లేవని  అమెరికా సీనియర్  అధికారి  గురువారం వెల్లడించారు.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్  సర్కార్ హెచ్ 1బీ వీసాలపై సమీక్షిస్తున్నంత మాత్రాన భారతీయులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతానికి హెచ్1బీ వీసాల జారీపై ఎలాంటి పరమితులు లేవని అమెరికా సీనియర్ అధికారి స్పష్టం చేయడం  విశేషం.

హెచ్‌ 1బీ  కేటగిరీలో జారీ అయ్యే వీసాలు ఎక్కువ శాతం భారతీయులకే దక్కాయని  ఆయన చెప్పారు.   గత తొమ్మిది నెలల్లో 70 శాతం వీసాలు భారతీయులకే లభించినట్టు చెప్పారు. తద్వారా గత సంవత్సరం రికార్డుల సంఖ్య 1.2 మిలియన్లను అధిగమించిందన్నారు.   ప్రపంచంలోని మిగిలిన దేశాల్లో పోలిస్తే భారత్‌కు సంవత్సర, సంవత్సరానికి  హెచ్‌1బీ, ఎల్‌ 1(వర్క్‌ పర్మిట్‌) వీసాల జారీ 6శాతం పెరుగుతోందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్త వలసదారుల వీసా దరఖాస్తుదారులతో పోలిస్తే  చైనా, ఫిలిప్పీన్స్, డొమినికన్ రిపబ్లిక్, మెక్సికోల తరువాత ఆరు శాతం వృద్ధితో ఐదో అతిపెద్ద లబ్దిదారులుగా  భారతీయులున్నారని వివరించారు.

గత ఏడాది 88వేల స్టూడెంట్‌ వీసాలను జారీ చేశామని 2015 సంవత్సరంపోలిస్తే ఇది 15శాతం అధికమని చెప్పారు. ప్రస్తుతం సుమారు 1.6లక్షల భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నారన్నారు.  చైనా తర్వాత  అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో  రెండవ స్థానంలో భారత్‌ ఉందని తెలిపారు.

సెప్టెంబరు 27 న వాషింగ్టన్‌లో  జరగనున్న ఇండో-అమెరికా ద్వైపాక్షిక  సమావేశంలో కేవలం వాణిజ్య, పర్యాటకరంగం అభివృద్ధి గురించే చర్చించడం జరుగుతుందనీ, కానీ ఎజెండాలో లేనప్పటికి  హెచ్‌ 1బీ  వీసాల ఆంక్షలు, పరిమితులు,కోత అంశం చర్చకు రావచ్చని ఆయన తెలిపారు.  అలాగే 7,000 మంది భారతీయులను ప్రభావితం చేయనున్న  డిఫెర్డ్‌ యాక్షన్ ఫర్ డిపార్టెడ్ యాక్షన్ (డిఎసిఎ)పై కూడా  చర్చ జరిగే అవకాశం ఉందన్నారు.
 

Advertisement
Advertisement