అణ్వస్త్రంతో అగ్నిపర్వతం బద్దలయితే.... | Sakshi
Sakshi News home page

అణ్వస్త్రంతో అగ్నిపర్వతం బద్దలయితే....

Published Fri, May 5 2017 5:49 PM

అణ్వస్త్రంతో అగ్నిపర్వతం బద్దలయితే....

బీజింగ్‌: ఉత్తర కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా మరో అణ్వస్త్ర ప్రయోగానికి సిద్ధమైతే సరిహద్దు ప్రాంతంలో వేలాది మంది అమాయక ప్రజలు మరణిస్తారని చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది. నేరుగా అణ్వస్త్ర ప్రయోగం వల్ల కాకుండా ఆ ప్రయోగం కారణంగా కొరియా, చైనా సరిహద్దులోని మౌంట్‌ పేంక్తూ అగ్ని పర్వతం బద్దలవడం వల్ల వేలాది మంది ప్రజలు మరణిస్తారని రాండ్‌ కార్పొరేషన్‌ను చెందిన డిఫెన్స్‌ విశ్లేషకులు బ్రూస్‌ బెన్నెట్‌ తెలిపారు. ఈ అగ్ని పర్వతాన్ని చైనా భాషలో చాంగ్‌బైషాన్‌ అని పిలుస్తారు.

ఉత్తర కొరియా అణు పరీక్షలు నిర్వహించే పుంగి–రీ ప్రాంతానికి కేవలం 130 కిలోమీటర్ల దూరంలో ఈ అగ్ని పర్వతం ఉంది. దానికి వంద కిలోమీటర్ల పరిధిలో ఇరు దేశాలకు చెందిన దాదాపు 16 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. అగ్ని ప్రమాదం బద్ధలయితే ఇరు ప్రజల ప్రాణాలకు ముప్పని చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2002 నుంచి 2005 మధ్య ఈ అగ్ని ప్రమాదంలో శిలాద్రవం పెరిగినట్లు ప్రకంపనల ద్వారా తెలుస్తోందని చైనా నిపుణులు పేర్కొంటున్నారు.

ఉత్తర కొరియా చాలా కాలం నుంచి ప్రపంచ దేశాలను దూరంగా ఉంచడం వల్ల అగ్ని పర్వతం నుంచి ముప్పు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో కచ్చితంగా చెప్పలేమని చైనా నిపుణులు చెబుతున్నారు. కొరియా ప్రాచీన చరిత్రపరంగా ఈ అగ్ని పర్వత ప్రాంతం కొరియాకు ఎంతో ప్రాధాన్యమైనది. కొరియా తొలి రాజ్యాన్ని స్థాపించిన డంగూన్‌ రాజు పుట్టిన స్థలం అదని వారి చరిత్ర తెలియజేస్తోంది. అందుకే మంచుతో కప్పబడిన మౌంట్‌ పేంక్తూ ప్రాంతాన్ని కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ 2015, ఏప్రిల్‌ 20వ తేదీన సందర్శించిన ఫొటోను వారి అధికార మీడియా విడుదల చేసింది.

కొరియా ఇటీవల నిర్వహించినట్లుగా పది కిలోటన్నుల అణ్వస్త్రాన్ని ప్రయోగించినా అగ్నిపర్వతం బద్దలయ్యే అవకాశం ఉందని, యాభై నుంచి వంద కిలోటన్నుల అణ్వస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రమాదం తీవ్ర స్థాయిలోనే ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement