స్వచ్ఛమైన మనసు | Sakshi
Sakshi News home page

స్వచ్ఛమైన మనసు

Published Thu, Jun 28 2018 10:14 PM

Nurul Yasmin  Orphanage Help To Orphans Girls Andaman Islands - Sakshi

తాగుబోతు తండ్రి ఇల్లొదిలి వెళ్లిపోయాడు.. తల్లి సంపాదన ఏ మూలకూ చాలలేదు.. సునామీ సర్వస్వమూ కోల్పోయేలా చేసింది...బతుకుబాటలో ఊరు విడిచింది...ఊరుకాని ఊరిలో ఇబ్బందులు ఎదుర్కొంది..
ఆకలి దప్పులతో అలమటించింది..చివరకు జీవితంలో నిలదొక్కుకుంది..వందలాది అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారింది.

సినిమాను తలపించే ఈ సంఘటలన్నీ యాస్మిని జీవితంలో చోటుచేసుకున్నవే.అందుకే ఈరోజు కథనం ఆమె గురించే..సాక్షి, స్టూడెంట్‌ ఎడిషన్‌.

దేశానికి తూర్పున, బంగాళాఖాతం మధ్యలో ఉంటాయి అండమాన్‌ నికోబార్‌ దీవులు. వీటి రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌లో నివసించే దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయే యాస్మిని. 2003 వరకూ ఆమె
జీవితం మామూలుగానే సాగిపోయింది. అయితే ఆ మరుసటి ఏడాది నుంచే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మద్యానికి బానిసైన తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లాడు. ఓ ప్రభుత్వ స్కూల్లో తక్కువ
వేతనానికి పనిచేసే తల్లి కుటుంబాన్ని పోషించడానికి అష్టకష్టాలూ పడేది. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు 2004లో వచ్చిన సునామీలో యాస్మిని కుటుంబం సర్వస్వమూ కోల్పోయింది. ఇల్లు ధ్వంసమైంది. సామగ్రి కొట్టుకుపోయింది. దీంతో రోజుల తరబడి రోడ్ల మీదే గడిపారు. అప్పుడు యామిని పదోతరగతి చదువుతోంది.

చదువుకుంటూ పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం.. 
ఈ పరిస్థితుల్లో కుటుంబ భారాన్ని మోసేందుకు తల్లికి సాయంగా కష్టపడాలని నిర్ణయించుకుంది యాస్మిని. వెంటనే చిన్నపాటి జీతానికి పార్ట్‌ టైం ఉద్యోగంలో చేరింది. ఉద్యోగం చేస్తూనే ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసింది.సునామీలో ధ్వంసమైన ఇంటికి మరమ్మతులు చేయించింది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని, తమ్ముళ్లను బాగా చదివించాలని నిర్ణయించుకొని మంచి ఉద్యోగం, సంపాదన కోసం ముంబైకి చేరింది. అయితే,అక్కడ అంత సులభంగా ఉద్యోగం దొరకలేదు. అష్టకష్టాలూ పడి ఓ ప్రభుత్వ కార్యాలయంలో రూ.6,500కు కాంట్రాక్టు పద్ధతిలో చిన్న ఉద్యోగం సంపాదించింది. వచ్చే ఆదాయంలోనే ఇంటి ఖర్చులకు పంపేది. ఒక్కోసారి తినడానికీ డబ్బులు సరిపోక పస్తులు ఉండేది. ఆ సమయంలోనే తిండి లేని తనలాంటి వాళ్లను, అనాథలను ఎంతోమందిని చూసింది. ఆలయాలు, ట్రాఫిక్‌ సిగ్నళ్లు, వీధుల్లో అనేకమంది నిరాశ్రయులు దిక్కుతోచని పరిస్థితుల్లో కడుపు ఎండబెట్టుకుంటున్నారని గుర్తించింది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ మంచి ఉద్యోగం వచ్చింది. దీంతో తనలాంటి వారి కడుపు నింపేందుకు నడుం బిగించింది.
 
అనాథల ఆకలి తీరుస్తూ..
అనుకున్నదే తడవుగా ఆచరణలోకి దిగింది. మొదట తన పుట్టినరోజును, పండగలను అనాథల సమక్షంలో జరుపుకోవడం ప్రారంభించింది. దీనికోసం మురికివాడలు, రైల్వే స్టేషన్లు, అనాథాశ్రమాలకు వెళ్లేది. అక్కడిపిల్లలకు, వృద్ధులకు కావల్సిన తినుబండారాలు, దుస్తులు తీసుకెళ్లి పంచేది. కొందరిని అనాథాశ్రమాల్లో చేర్పించింది. ఇదే సమయంలో ఆమెకు ఓ పెద్ద రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీతంతోపాటుఅదనంగా కమీషనూ రావడం మొదలైంది. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌లో కనిపించిన చిన్ననాటి స్నేహితునితో ప్రేమలో పడి, వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత దంపతులు చెన్నైకి వెళ్లి వ్యాపారం ప్రారంభించారు. వ్యాపారంవృద్ధి చెందడంతో మంచి ఇంటితోపాటు కారు కొనుగోలు చేశారు. ఈ కార్లోనే రోజూ అనాథలు, నిరాశ్రయులకు కావల్సిన ఆహార పదార్థాలు, బట్టలు, చెప్పులు, చాక్లెట్లు, మందులు కొని పంచడం మొదలుపెట్టారు. ప్రస్తుతం రోజూ నగరంలో కనీసం 30 కి.మీ ప్రయాణిస్తూ వీటిని అందజేస్తున్నారు. అనాథలు, నిరాశ్రయుల ఆకలి తీరుస్తున్నారు.
 
యాస్మిన్‌ అంటే అరబిక్‌లో మల్లెపువ్వు అని అర్థం. ఇంగ్లిష్‌లోని జాస్మిన్‌ పదానికి ఇదే మూలం. మల్లెపువ్వు తెల్లదనం స్వచ్ఛతకు ప్రతీక. అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారిన యాస్మిన్‌ మనసు కూడా
స్వచ్ఛమైనదే.

1/1

యాస్మిని

Advertisement

తప్పక చదవండి

Advertisement