ఒబామాపై ట్రంప్ విమర్శలు | Sakshi
Sakshi News home page

ఒబామాపై ట్రంప్ విమర్శలు

Published Sat, Jun 11 2016 9:14 AM

ఒబామాపై ట్రంప్ విమర్శలు - Sakshi

రిచ్మండ్: నేర అభియోగాలు ఎదుర్కొంటున్న డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ను అధ్యక్షుడు ఒబామా బలపరుస్తున్నారని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. అయినా సరే నవంబర్లో జరిగే ఎన్నికల్లో హిల్లరీని ఎదుర్కోవడానికి సిద్థంగా ఉన్నానని ట్రంప్ ప్రకటించారు. హిల్లరీకి ఒబామా మద్దతు ప్రకటించిన తరువాత వర్జీనియాలోని రిచ్మండ్లో నిర్వహించిన తొలి ఎన్నికల ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు. నేర అభియోగాలు ఎదుర్కొటున్న వారికి దేశాధ్యక్షుడు మద్దతు తెలుపుతున్నారని, అయితే దేశం ఇదే కోరుకుంటుందా అని ర్యాలీకి హాజరైన ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు.

ప్రస్తుత డెమోక్రటిక్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఇటీవల ఇండియన్ అమెరికన్ రాజీవ్ ఫెర్నాండోకు కీలక పదవిని కట్టబెట్టడానికి కారణం అతడు క్లింటన్ ఫౌండేషన్కు ఎక్కువ మొత్తంలో డొనేషన్లు చెల్లించడమేనన్నారు. మెక్సికో, చైనాలాంటి దేశాలు అమెరికాను నాశనం చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం దేశ వర్తక వ్యవహారాలు చూస్తున్న వ్యక్తులు తెలివితక్కువగా వ్యవహరిస్తున్నారని ట్రంప్ విమర్శించారు.

మెక్సికో బార్డర్లో గోడను నిర్మిస్తానని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. భవిష్యత్తులో కొందరు దానిని ట్రంప్ వాల్ అని పిలువోచ్చునని అన్నారు. బలమైన, ఎత్తైన, అందమైన గోడగా తాను కట్టబోయే గోడ ఉంటుందని తెలిపారు. పరిశ్రమలను అమెరికాలోనే నెలకొల్పేలా చూడటం ద్వారా దేశంలో ఉపాధిని పెంపోందించాలన్నారు. అమెరికాకు దక్కాల్సిన వేలాది ఉద్యోగాలు విదేశాలకు తరలిపోతున్నాయని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు.
 

Advertisement
Advertisement