ఒక్కడు... పది జాబ్స్ | Sakshi
Sakshi News home page

ఒక్కడు... పది జాబ్స్

Published Sun, Apr 24 2016 4:09 AM

ఒక్కడు... పది జాబ్స్

ఓ వ్యక్తి... 10 ఉద్యోగాలకు సంబంధించిన విధులు నిర్వర్తించడం సాధ్యమేనా? ఎందుకు కాదు... అంటూ చేసి చూపెడుతున్నాడు 67 ఏళ్ల బిల్లీ మూయిర్. స్కాట్లాండ్‌లో మారుమూల ద్వీపం... నార్త్ రొనాల్డ్‌సేలో మూయిర్ నివసిస్తున్నాడు. ఈ బుల్లి ద్వీపంలో ఆయన ఏకంగా పది ఉద్యోగాలు అవలీలగా చేసేస్తున్నాడు. అవేమిటంటారా... ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, ఎయిర్‌పోర్ట్ అగ్నిమాపక దళ సభ్యుడు, ట్యాక్సీ డ్రైవర్, లైట్‌హౌస్ నిర్వాహకుడు, హాలీడే రిసార్ట్స్ యజమాని, స్థానిక కౌన్సిలర్, బిల్డర్... ఇలా మొత్తం పది ఉద్యోగాలను ఏకకాలంలో చేసేస్తున్నాడు. లైట్ హౌస్ పూర్తిగా ఆటోమేటెడ్...

అప్పుడప్పుడు వెళ్లి తనిఖీ చేయడం, అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోవడం మూయిర్ విధి. అలాగే ఈ దీవికి ఎప్పుడైనా విమానాలు వస్తుంటే... మూయిర్‌కు ముందే మొబైల్‌కు సమాచారం వస్తుందట. అప్పుడు ఎయిర్‌స్ట్రిప్ వద్దకు వెళ్లి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అవతారం ఎత్తుతాడు. దీవిలో అగ్నిమాపక దళంలోని ఏకైక సిబ్బంది కూడా ఇతనే. అగ్ని ప్రమాదాలను నియంత్రించడంలో ప్రత్యేక శిక్షణ కూడా పొందాడు. ఇన్ని చేస్తూనే ఖాళీ సమయాల్లో తన గొర్రెలను మేపడానికి వెళతాడు. ఒక్కడే ఇవన్నీ చేయడం ఎందుకంటే... ఈ దీవి జనాభా 50 మంది మాత్రమే. దాంతో మనోడు సాధ్యమైనన్ని పనులు తానే చక్కబెడుతుంటాడు. 67 ఏళ్లు వచ్చినా... ఇప్పుడప్పుడే రిటైరయ్యే ఆలోచనేమీ లేదని హుషారుగా చెబుతాడు. దటీజ్ స్పిరిట్.

Advertisement
Advertisement