బరువు పెరుగుతున్న అమెరికా | Sakshi
Sakshi News home page

బరువు పెరుగుతున్న అమెరికా

Published Tue, Jun 13 2017 6:38 PM

బరువు పెరుగుతున్న అమెరికా - Sakshi


న్యూయార్క్‌: ప్రపంచంలో దాదాపు 200 కోట్ల మంది పెద్దలు, పిల్లలు ఎక్కువ బరువు లేదా స్థూలకాయంతో బాధ పడుతున్నారు. అంటే ప్రపంచ జనాభాలో మూడింట ఒకవంతు మంది అధిక బరువుతో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, అందులో అమెరికా ప్రజలే అన్ని దేశాల కన్నా ముందున్నారని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. పట్టణీకరణ, సరైన పోషకపదార్థాలు లేని ఆహారం తీసుకోవడం, వ్యాయామం లోపించడం ఇందుకు కారణాలని అధ్యయనం తేల్చింది.

మొత్తం ప్రపంచ జనాభా దాదాపు 710 కోట్ల మందికాగా, వారిలో 220 మంది, అంటే వారిలో పిల్లలు ఐదుశాతం, పెద్దలు 12 శాతం అధిక బరువుతో బాధ పడుతున్నారు. అమెరికాలో 13 శాతం పిల్లలు, 35 శాతం పెద్ద వాళ్లు అధిక బరువుతో బాధ పడుతున్నారు. ఈ అధిక బరువు కారణంగా కార్డియో వాస్కులర్‌ వ్యాధులు వచ్చి ఎక్కువ మంది పిన్న వయస్సులో చనిపోతున్నారు.

అధిక బరువుతో బాధ పడుతున్న వారిలో 40 శాతం మంది అకాల మత్యువాత పడుతున్నారని వాషింఘ్టన్‌ యూనివర్శిటీకి చెందిన డాక్టర్‌ క్రిస్టఫర్‌ ముర్రే తెలిపారు. స్థూలకాయం కారణంగా వారికి గుండె జబ్బులతోపాటు మధుమేహం, క్యాన్సర్‌ వస్తున్నాయని ఆయన తెలిపారు. అన్ని వయస్సుల గ్రూపుల్లోనూ మగవాళ్లకన్నా ఆడవాళ్లే ఎక్కువ బరువు పెరగుతున్నారు.

జనాభా పరంగా చూసినట్లయితే చైనా, ఆ తర్వాత భారత దేశాలు అధిక బరువుతో బాధ పడుతున్నాయి. చైనాలో 1.53 కోట్ల మంది పిల్లలు, భారత్‌లో 1.44 కోట్ల మంది పిల్లలు అధిక బరువుతో బాధ పడుతున్నారు. బంగ్లాదేశ్, వియత్నాంలలో ఒక్క శాతం మంది మాత్రమే అధిక బరువుతో బాధ పడుతున్నారు.

Advertisement
Advertisement