Sakshi News home page

మా అణ్వస్త్రాలు.. ఆటబొమ్మలు కావు

Published Thu, Sep 29 2016 11:29 AM

మా అణ్వస్త్రాలు.. ఆటబొమ్మలు కావు - Sakshi

తమ వద్ద అణ్వస్త్రాలు ఉన్న విషయాన్ని పాకిస్థాన్ పదే పదే బయటకు చెబుతోంది. భారతదేశంతో ఒకవేళ యుద్ధం అంటూ వస్తే వాటిని ఉపయోగించడానికి ఏ మాత్రం వెనకాడేది లేదని అంటోంది. ఈ విషయాన్ని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తమ వద్ద ఉన్న అణ్వస్త్రాలు ఆటబొమ్మలేవీ కావని ఆయన అన్నారు. ''మా దగ్గర ఉన్న వ్యూహాత్మక ఆయుధాలను మా రక్షణ కోసమే తయారు చేశాం. ఈ ఆయుధాలు ఆటబొమ్మలు ఏమీ కావు. మా క్షేమానికి ఏమైనా ముప్పు ఉందనుకుంటే వాటిని వెంటనే ఉపయోగంలోకి తీసుకొస్తాం'' అని జియో టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసిఫ్ చెప్పారు. ఈ ఇంటర్వ్యూ సెప్టెంబర్ 26వ తేదీన ప్రసారమైంది. ఉడీ ఉగ్రదాడి జరగడానికి ఒక్కరోజు ముందు.. అంటే సెప్టెంబర్ 17వ తేదీన కూడా ఇలాంటిదే మరో ఇంటర్వ్యూ ప్రసారమైంది.

ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తుందన్న భయం ఏమీ లేదని.. కానీ ఖురాన్‌లో అల్లా చెప్పినట్లు, 'గుర్రాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి' అని ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ అన్నారు. పాకిస్థాన్ మీద ఎప్పుడూ ఒత్తిడి ఉంటూనే ఉందని, అందువల్ల అవసరమైన వాటి కంటే ఎక్కువగా తమదగ్గర వ్యూహాత్మక ఆయుధాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయంలో తమదే ఆధిక్యం అన్న విషయానికి అంతర్జాతయంగా కూడా గుర్తింపు ఉందని చెబుతూ.. ఎవరైనా తమ గడ్డమీద అడుగుపెట్టినా, తమ అంతర్గత భద్రతకు ముప్పు తేవాలని చూసినా తమ రక్షణ కోసం ఆ ఆయుధాలను ఉపయోగించడానికి వెనుకాడబోమని అన్నారు. భారతదేశంతో యుద్ధం వస్తే పాకిస్థాన్ అణ్వాయుధాలు ఉపయోగిస్తుందా అన్న ప్రశ్నకు.. అది పరిస్థితులను బట్టి  ఆధారపడుతుందని, తమ ఉనికి ప్రమాదంలో పడితే తాము అన్నింటినీ ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. అందులో భయపడాల్సింది ఏముందని ఎదురు ప్రశ్నించారు.

Advertisement
Advertisement