పాక్‌ టీవీ ఛానెళ్లలో భారత సినిమాలపై నిషేధం

6 Mar, 2019 11:02 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : భారతీయ సినిమాలను ప్రైవేట్‌ చానెల్స్‌, టీవీ షోల్లో ప్రసారం చేయడాన్ని పాకిస్తాన్‌ సుప్రీం కోర్టు నిషేధించింది. పుల్వామా ఉగ్రదాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాక్‌ సర్వోన్నత న్యాయస్ధానం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్తాన్‌లో భారత టీవీ ఛానెళ్లను అనుమతిస్తూ లాహోర్‌ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ గుల్జార్‌ అహ్మద్‌ నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

పిటిషన్‌ దాఖలు చేసిన పాకిస్తాన్‌ ఎలక్ర్టానిక్‌ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్‌ఏ) న్యాయవాది కోర్టులో తన వాదన వినిపిస్తూ స్ధానిక ఛానెళ్లలో పది శాతం విదేశీ కంటెంట్‌ను అనుమతిస్తూ 2006లో ప్రభుత్వం ఓ విధాన నిర్ణయం తీసుకున్నా, 2016, అక్టోబర్‌ 19న పాక్‌ టీవీ ఛానెళ్లలో భారత కంటెంట్‌ ప్రసారంపై పీఈఎంఆర్‌ఏ పూర్తి నిషేధం విధించిందని నివేదించారు.

కాగా, భారత అధికారులు పాక్‌ కంటెంట్‌ ప్రసారాన్ని నిలిపివేసిన క్రమంలో పాక్‌లో సైతం భారత కంటెంట్‌ను పీఈఎంఆర్‌ఏ నిషేధించిందని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు లాహోర్‌ హైకోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చి పాక్‌ ఛానెళ్లలో భారత కంటెంట్‌ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు