Sakshi News home page

యుద్ధవిమానాలు పోతేనే గగనతలం తెరుస్తాం

Published Sat, Jul 13 2019 3:03 AM

Pakistan will not open airspace until India withdraws fighter jets from IAF forward airbases - Sakshi

ఇస్లామాబాద్‌: సరిహద్దుల్లోని యుద్ధ విమానాలను భారత్‌ తరలిస్తే తప్ప తమ దేశం గుండా వాణిజ్య విమానాలకు గగనతలం తెరవబోమని పాకిస్తాన్‌  విమానయాన కార్యదర్శి షారుక్‌ నుస్రత్‌ స్పష్టంచేశారు. పుల్వామా తీవ్రవాద దాడి అనంతరం పాక్‌లోని బాలాకోట్‌లో జైషే మహ్మద్‌ తీవ్రవాద స్థావరాలను భారత యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 26 తర్వాత నుంచి పాక్‌ తన గగనతలంపైనుంచి భారత విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. నుస్రత్‌ ఆదేశాలతో పాక్‌ విమానయాన శాఖకు చెందిన సెనేట్‌ స్టాండింగ్‌ కమిటీ భారత అధికారులకు సమాచారమిచ్చింది. ‘పాక్‌ గగనతలం తెరవాలని భారత ప్రభుత్వం సంప్రదించింది. మేం అందుకు సిద్ధం. అయితే ముందుగా సరిహద్దుల్లోని వైమానిక స్థావరాల నుంచి యుద్ధ విమానాలను భారత్‌ ఇతర ప్రాంతాలకు తరలించాలి’ అని నుస్రత్‌ పేర్కొన్నారు. గగనతలం తెరవడంపై ఓ పాక్‌ సీనియర్‌ అధికారి స్పందించడం ఇదే మొదటిసారి. పాక్‌ గగనతలం మూసివేతపై ఆంక్షలు జూలై 12 వరకు పొడిగించారు. ఏదిఏమైనా పాక్‌ గగనతల మూసివేతతో భారత విమానయాన పరిశ్రమకు తీవ్ర నష్టాలు ఎదురయ్యాయి. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి  మాట్లాడుతూ.. పాక్‌ గగనతల మూసివేత కారణంగా దూరపు మార్గాల్లో విమానాలు ప్రయాణించడం ద్వారా ఎయిరిండియా రూ.430 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలిపారు. 

Advertisement

What’s your opinion

Advertisement