స్పర్శను గుర్తించే ‘పేపర్ స్కిన్’ | Sakshi
Sakshi News home page

స్పర్శను గుర్తించే ‘పేపర్ స్కిన్’

Published Fri, Mar 11 2016 8:07 PM

స్పర్శను గుర్తించే ‘పేపర్ స్కిన్’

 రియాద్: మన శరీరంపై ఉండే చర్మం స్పర్శ, వేడి, తడి, ఒత్తిడి, కదలికలను ఏక కాలంలో గుర్తిసుంది. ఇదేమీ అద్భుతం కాదు. మన ఇంట్లో దొరికే అతి చౌకైన వస్తువులతో చర్మం లాగే అన్ని ప్రక్రియలను ఏకకాలంలో గుర్తించి స్పందించి కృత్రిమ చర్మం లేదా స్మార్ట్ స్కిన్‌ను తయారు చేయడం అద్భుతం. సౌదీ అరేబియాలోని ‘కింగ్ అబ్బుల్లా సైన్స్ అండ్ టెక్నాలజీ’ యూనివర్శిటీలో ఇంటీగ్రేటెడ్ నానో టెక్నాలోజీ లేబరేటరీకి అధిపతిగా పనిచేస్తున్న శాస్త్రవేత్త ముహమ్మద్ ముస్తఫా హుస్సేన్ టీమ్ ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది.

 ఈ స్మార్ట్ స్కిన్‌ను తయారు చేసేందుకు ఆయన ఉపయోగించిన వస్తువులు ఇంట్లో దొరికే స్పాంజ్, సిల్వర్ ఫాయిల్, సిల్వర్ ఇంక్, గ్రాఫైట్ పెన్సిల్, చర్మానికి అతుక్కునే ఓ గమ్మీ గుడ్డ. ఒత్తిడి గుర్తించేందుకు స్పాంజ్ ముక్కలు, కదలికలను గుర్తించేందుకు సిల్వర్ ఫాయిల్, తేమ గుర్తించేందుకు గ మ్మీ గుడ్డ, వేడి, అసిడిటీని గుర్తించేందుకు సిల్వర్ ఇంక్, గ్రాఫైట్ పెన్సిల్‌ను ఉపయోగించారు. వీటన్నంటికి అయ్యే ఖర్చు 120 రూపాయలు కూడా దాటదని ఆయన చెప్పారు. చర్మానికి కాలిన గాయాలు అయినప్పుడు, గాయం ఉన్న చోట చర్మం స్పర్శను కోల్పోతుందని, వారికి ఈ స్మార్ట్ స్కిన్ ఎంతో ఉపయోగపడుతోందని, దానికి తాము పేపర్ స్కిన్ అని నామకరణం చేసినట్లు ముస్తఫా హుస్సేన్ వివరించారు.

ఇతర కృత్రిమ చర్మంలో లాగా కార్బన్ ట్యూబ్స్‌ను వాడడానికి తానేమి వ్యతిరేకిని కాదని, అయితే అవి చాలా ఖరీదని హుస్సేన్ తెలిపారు. మానవ కృత్రిమ చర్మం సృష్టించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఇప్పటికీ జరగుతున్నాయి. చర్మంలా పనిచేసే ప్రొస్టేట్ తొడుగులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. రోబోలకు స్మర్శ తెప్పించేందుకు కూడా ఈ తొడుగులను వాడుతున్నారు. కార్బన్ ట్యూబ్ టెక్నాలజీతో తయారు చేసే ఇవి చాలా ఖరీదైనవి. వీటిలోనూ ఆధునికత  కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి.

ఈ ప్రయోగాలు రేపు ఎప్పుడో ఫలించి చౌకైన రేటుకు అందుబాటులోకి రావచ్చుగానీ, నేను మాత్రం రేపుకాస్త నేడు కావాలనే వ్యక్తినని, అందుకని తన ఈ పేపర్ స్కిన్‌కు ప్రాచుర్యం కల్పిస్తే రెండేళ్లలో ఇవి మార్కెట్‌లోకి వస్తాయని హుస్సేన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ప్రతి ఇంట్లో అందుబాటులో దొరికే వస్తువులతో నేను పేపర్ స్కిన్‌ను తయారు చేయడం ప్రస్తుతం అందరికి నవ్వులాటలాగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement