సొంత పాటలకు బీబర్ డబ్బింగ్.. షో అట్టర్‌ఫ్లాప్! | Sakshi
Sakshi News home page

సొంత పాటలకు బీబర్ డబ్బింగ్.. షో అట్టర్‌ఫ్లాప్!

Published Thu, May 11 2017 4:44 PM

సొంత పాటలకు బీబర్ డబ్బింగ్.. షో అట్టర్‌ఫ్లాప్!

బీబర్.. బీబర్... అంటూ ముంబై ఉర్రూతలూగింది. జస్టిన్ బీబర్ స్వయంగా భారతదేశానికి వచ్చి కన్సర్ట్ చేస్తున్నాడంటే ఫ్యాన్స్ వెర్రెత్తిపోయారు. వేలకు వేలు డబ్బులు పోసి టికెట్లు కొనుక్కుని మరీ షోకు వెళ్లారు. తీరా చూస్తే.. అక్కడ వెనకాల ఆడియో ఒకలా వస్తోంది, బీబర్ నోరు మరోలా పలుకుతోంది. ఎక్కడా లిప్ సింక్ కావట్లేదు. సాధారణంగా మన దేశంలో ఇలాంటి కన్సర్ట్స్ అంటే.. లైవ్‌లోనే పాట పాడతారు. అలాగే అనుకుని షోకు వెళ్లిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన బీబర్ షో.. మొత్తానికి అట్టర్ ఫ్లాప్ అని ఇండియన్ ఆడియన్స్ తేల్చేశారు. ప్రేక్షకుల హాజరు అయితే బ్రహ్మాండంగా ఉంది. దాంతో కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి గానీ షో విజయవంతం అయ్యే విషయంలో మాత్రం మనోళ్లు అబ్బే అంటున్నారు.

వాస్తవానికి రాత్రిపూట డిమ్ లైట్లలో స్టేజి మీద పెర్ఫామెన్స్ కావడంతో ఎక్కువ మంది గమనించలేకపోయారు గానీ.. అతడంటే పడిచచ్చే అభిమానులు తమ అభిమాన స్టార్‌ను దగ్గర నుంచి చూడాలని ఎలాగోలా ముందుకెళ్లారు. వాళ్లకు అసలు విషయం తెలిసిపోయింది. బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ ప్లే అవుతుంటే దానికి బీబర్ లిప్ సింక్ అయ్యేలా ప్రయత్నించి అదే పాటను పాడుతున్నట్లుగా నోరు ఆడించాడు. కానీ, ఎక్కడా లిప్ సింక్ కాకుండా అదంతా డబ్బింగ్ అని మనోళ్లకు తెలిసిపోయింది. దాంతో సోషల్ మీడియాలో అంతా ఒక్కసారిగా తిట్టిపోశారు. ఏకంగా 75 వేల రూపాయల వరకు కూడా టికెట్ ధరలు ఉన్నా కూడా ఏమాత్రం వెనకాడకుండా వెళ్లినందుకు తమకు ఇలాంటి శాస్తి జరగాల్సిందేనని అంటున్నారు. ట్విట్టర్‌లో ఒక యూజర్ అయితే, ప్రోగ్రాం జరుగుతున్నంత సేపు బీబర్ చ్యూయింగ్ గమ్ నములుతూనే ఉండటాన్ని గమనించారు. దాంతో ఈ ప్రోగ్రాం పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అని తిట్టిపోస్తున్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement