కోతి ఫొటో తీసింది.. కాపీరైట్‌పై దుమారం రేగింది..! | Sakshi
Sakshi News home page

కోతి ఫొటో తీసింది.. కాపీరైట్‌పై దుమారం రేగింది..!

Published Fri, Aug 8 2014 8:16 AM

కోతి ఫొటో తీసింది.. కాపీరైట్‌పై దుమారం రేగింది..!

అందంగా పళ్లికిలిస్తున్న ఈ నల్ల మకాక్ కోతి ఇప్పుడు ఓ పెద్ద దుమారానికే కేంద్ర బిందువు అయింది. ఇండోనేసియన్ దీవి సులావెసీలో మూడేళ్ల క్రితం డేవిడ్ స్లాటర్ అనే ఫొటోగ్రాఫర్ కోతుల గుంపును ఫొటోలు తీస్తుండగా.. ఈ కోతి అతడి నుంచి కెమెరా లాక్కుని పారిపోయింది. తర్వాత ఎడాపెడా వందలాది ఫొటోలు తీసేసింది. పనిలోపనిగా చిత్రంలో కనిపిస్తున్న ఈ సెల్ఫీ(సొంత ఫొటో)తో పాటు అనేక ఫొటోలు తనివితీరా తీసుకుని కెమెరాను తిరిగి ఇచ్చేసింది. దీంతో తొలి జంతు(మర్కట) ఫొటోగ్రాఫర్‌గా ఇది అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకెక్కింది. ఒక జంతువు చేసిన అద్భుతమైన పనిగా దీనిని భావించిన ఇంటర్నెట్ విజ్ఞానసర్వస్వం వికీపీడియా నిర్వాహకులు కూడా ఈ ఫొటోను తమ వెబ్‌సైట్‌లో ఉంచారు.

అయితే.. తన అనుమతి లేకుండానే ఈ ఫొటోను వికీపీడియా వారు వాడుకుని కాపీరైట్‌ను ఉల్లంఘించారంటూ ఇప్పుడు ఆ ఫొటోగ్రాఫర్ కోర్టుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ ఫొటోను ఉచితంగా అందరికీ అందుబాటులో ఉంచడం వల్ల తాను బోలెడు ఆదాయం నష్టపోతున్నానని, అందువల్ల వికీపీడియాను నడుపుతున్న వికీమీడియా కంపెనీపై 30 వేల డాలర్ల నష్టపరిహారం కోరుతూ దావా వేస్తానని అంటున్నాడు. అయితే కెమెరా ఫొటోగ్రాఫర్‌ది అయినా.. ఫొటోను క్లిక్ చేసింది కోతే కాబట్టి.. ఈ ఫొటోపై కాపీరైట్ ఉంటేగింటే ఆ కోతికే ఉంటుందని వికీపీడియా వాదిస్తోంది. వెబ్‌సైట్ నుంచి ఈ ఫొటోను తొలగించే ప్రసక్తే లేదని, ఏం చేసుకుంటావో, చేసుకో! అంటూ స్పష్టంచేసింది. ఈ అమాయక కోతిచేష్ట పర్యవసానం చివరకు ఎంతవరకూ దారితీస్తుందనేది వేచిచూడాల్సిందే!
 

Advertisement
Advertisement