వెలుగులోకి సంచలన నటి మార్చురీ ఫొటోలు 

18 Aug, 2019 18:59 IST|Sakshi

న్యూయార్క్‌ : అలనాటి మేటి సంచలనాల నటి మార్లిన్‌ మన్రోకు సంబంధించిన రెండు రహస్య ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. మార్లిన్‌ మరణానంతరం మార్చురీలో ఉన్న ఆమె శవానికి చెందిన ఫొటోలు దాదాపు 60 సంవత్సరాల తర్వాత వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. 1950లలో ఓ వెలుగు వెలిగిన సంచలన తార మార్లిన్‌ మన్రో 1962 ఆగస్టు 4న ఎక్కువ నిద్రమాత్రలు మింగటం కారణంగా మృత్యువాత పడ్డారు. అనంతరం ఆమె మృతదేహాన్ని అక్కడి ఓ మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న ఫొటోగ్రాఫర్‌ లై వైనర్‌ మార్చురీ వద్దకు చేరుకుని, మార్చురీ సిబ్బందికి ఓ రెండు బాటిళ్ల వైన్‌ లంచంగా ఇచ్చి మార్లిన్‌ ఫొటోల కోసం అనుమతి తీసుకున్నారు. ఆమె శవానికి చెందిన 5 ఫొటోలను తీసిన ఆయన మూడింటిని పత్రికలకు అమ్మేశారు.

పనికిరావు అనుకున్న ఓ రెండు ఫొటోలను తన వద్దే ఉంచుకున్నారు. అలా తన వద్ద ఉన్న ఫొటోలను బయటకు తీయకుండానే 1993లో కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం ఓ ప్రముఖ ఛానల్‌ మార్లిన్‌ మృతిపై ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయటంతో పాటు లై వైనర్‌ కుమారుడితో ముఖాముఖి జరిపింది. ఆ సమయంలో తన తండ్రి దాచిన ఫొటోల గురించి ఆయన ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. కాగా, మార్లిన్‌ మృతి చెందిన 24 గంటల వరకు కూడా ఆమె శవాన్ని స్వాధీనం చేసుకోవటానికి ఎవరూ రాకపోవటం అప్పట్లో సంచలనం సృష్టించింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు