పాక్ ప్రధాని తల్లికి మోదీ పాదాభివందనం | Sakshi
Sakshi News home page

పాక్ ప్రధాని తల్లికి మోదీ పాదాభివందనం

Published Fri, Dec 25 2015 8:55 PM

పాక్ ప్రధాని తల్లికి మోదీ పాదాభివందనం - Sakshi

న్యూఢిల్లీ: పాకిస్తాన్లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం, ఆతిథ్యం లభించింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్.. మోదీ కోసం ప్రత్యేక వంటకాలు చేయించారు. శుక్రవారం సాయంత్రం లాహోర్ నగర శివారు రాయ్విండ్లోని నవాజ్ షరీఫ్ నివాసానికి వెళ్లిన మోదీకి.. పాక్ ప్రధాని కొడుకు, ఇతర కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. షరీఫ్ తన కుటుంబ సభ్యులను మోదీకి పరిచయం చేశారు. అనంతరం ఇరు దేశాల ప్రధానులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని తల్లి అక్కడికి రాగా.. మోదీ ఆమెకు పాదాభివందనం చేశారు. నవాజ్ తన నివాసంలో మోదీకి ఏర్పాటు చేసిన విందులో ఆయనకు ఇష్టమైన సాగ్, దాల్, శాకాహార వంటకాలను వండించారు. మోదీకి ప్రత్యేకంగా కశ్మీరీ టీ అందజేశారు. ఈ రోజు షరీఫ్ పుట్టినరోజుతో పాటు ఆయన మనవరాలి పెళ్లి. పాక్ ప్రధాని మనవరాలి వివాహంలో అనుకోని అతిథిలా నరేంద్ర మోదీ తళుక్కున మెరిశారు. ఊహించనివిధంగా మోదీ పాక్ పర్యటనకు వెళ్లడం ఇరు దేశాల్లోనూ ఆశ్చర్యానికి గురిచేసింది.

శుక్రవారం సాయంత్రం లాహోర్ వెళ్లిన మోదీకి విమానాశ్రయంలో షరీఫ్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఇద్దరూ ప్రత్యేక హెలికాప్టర్లో షరీఫ్ నివాసానికి వెళ్లారు. షరీఫ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. ఆయన మనవరాలిని ఆశీర్వదించారు. అనంతరం లాహోర్ నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు.  'పాక్ ప్రధాని ఎంతో ఆత్మీయత చూపారు. ఈ రోజు సాయంత్రం నవాజ్ ఇంట్లో ఆయన కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడిపాను. షరీఫ్ జన్మదినం, ఆయన మనవారి వివాహం రెండు వేడుకల్లో పాల్గొన్నా' అని మోదీ ట్వీట్ చేశారు.
 

Advertisement
Advertisement