వీడు సామాన్యుడు కాదు.. | Sakshi
Sakshi News home page

వీడు సామాన్యుడు కాదు..

Published Sat, Jul 11 2015 12:38 PM

వీడు సామాన్యుడు కాదు..

వీడు తొమ్మిదేళ్ల బుడతడు. పనికిరాని చెక్క ముక్కలతో చేసిన బల్లపై నోటు పుస్తకాలను పెట్టుకొని తదేక దృష్టితో హోం వర్క్ చేసుకుంటున్నాడు. పక్కనున్న మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్ కిటికీ గుండా పడుతున్న వెలుతురే వీటికి లైట్. ఆ లైట్ ఆరిపోక ముందే వీడు హోంవర్క్ పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే వీడి ఇంట్లో లైట్ లేదు. అసలు కరెంటే లేదు. వీడుంటున్నది అసలు ఇల్లే కాదు. ఫొటోలో వెనకాల కనిపిస్తున్న పాల్తిన్ కవర్‌తో చుట్టిన షెడ్డులాంటి ప్రాంతమే వీడిల్లు. చదువుకోవడం, రాసుకోవడం పూర్తయ్యాక.. హోంవర్క్‌కు ఉపయోగించుకున్న బల్లనే తీసుకెళ్లి తన ఇల్లు కాని ఇంట్లో వేసుకొని పడుకొంటాడు. పొద్దున్నేలేచి ఎనిమిది గంటలకల్లా స్కూల్లో ఉంటాడు.

వర్షం, చలి, ఎండ దేన్ని లెక్కచేయకుండా అదే ఇంట్లో ఉంటాడు. రాత్రిపూట అదే రెస్టారెంట్ వెలుతురులో చదువుకుంటాడు. వీడి తల్లి ఓ చిన్న రెస్టారెంట్ యజమాని ఇంట్లో పాచి పని చేస్తుంది. ఆ వచ్చిన కాస్త డబ్బులతో ఆమె వీడితోపాటు మరో ఇద్దరి పిల్లలను పోషించాలి. ముగ్గురి పిల్లల్లో వీడికే చదువంటే ప్రాణం. ఉదయం స్కూల్‌కు వెళితే మళ్లీ స్కూల్ అయిపోయాక సాయంత్రమే ఇంటికి రావడం. మధ్యాహ్న భోజనాన్ని పట్టించుకోడు. ఏదో నేరం చేసి జైలుకెళ్లిన వీడి తండ్రి మూడేళ్ల క్రితం జైల్లో అతిసారా వ్యాధితో మరణించాడు. అంతకుముందు వీడి కుటుంబానికి ఓ చిన్నపాటి ఇల్లు ఉండేది. ఐదేళ్ల క్రితం అది అగ్నిప్రమాదంలో ఖాళీపోయింది.

అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ చిన్నప్పుడు వీధి దీపాల కిందనే చదువుకొని అంతపైకి వచ్చాడనే విషయాన్ని వీడి స్కూల్లో బోధించారో, లేదో తెలియదుగానీ, తప్పనిసరి పరిస్థితుల్లో వీడు అలాంటి పరిస్థితుల్లోనే చదువుకుంటున్నాడు. అబ్రహాం లింకన్ అంత పెద్దవాడు కావాలని వీడికి లేదుగానీ ఓ డాక్టరో, పోలీసు ఆఫీసరో కావాలన్నది వీడి కోరిక. వీడి పేరు డేనియల్ క్యాబ్రెరా. తల్లిపేరు క్రిస్టినా ఎస్పినోజా. ఉంటున్న ప్రాంతం ఫిలిప్పీన్స్‌లోని మాండవ్ సిటీ. ఇప్పుడు వీడి చదువుకు ప్రపంచం నలుమూలల నుంచి విరాళాలు వస్తున్నాయి. అది ఎలా జరిగిందంటే..!

మెడికల్ టెక్నాలజీ చదువుతున్న 20 ఏళ్ల జాయిస్ టొర్రెఫ్రాంకా అనే యువతి ఓ రోజు వీడి ఇంటి ముందుగా వెళ్తూ రెస్టారెంట్ వెలుతురులో  చదువుకోవడాన్ని చూసి చలించిపోయింది. వెంటనే తన సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసి సామాజిక వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసింది. ఈ పిల్లాడి నుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందానని, దాంతో ఇప్పుడు తానూ బాగా చదుకుంటున్నానని కామెంట్ పెట్టింది. అంతే.. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫొటో సర్కులేట్ అవుతూ వస్తూనే ఉంది. వీడి ఫొటోతో తాము ఎంతో స్ఫూర్తి పొందామంటూ వెబ్‌సైట్లలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. వీడి ఫొటో ఇంత సంచలనం సృష్టిస్తుందని తాను భావించలేదని.. తన పేజీ బుక్‌లో అప్‌లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే ఏడువేల కాపీలు పోస్ట్ అయ్యాయని, వారందరికి థ్యాంక్స్ అని జాయస్ తెలిపారు. వీడి చదువుకు సహాయపడాల్సిందిగా కోరింది. అంతే ప్రపంచవ్యాప్తంగా స్పందనలు వస్తున్నాయి.

'ఈ బుడతడు చేస్తున్న పనిని మనమెందుకు చేయలేం. ఏ సౌకర్యంలేని వీడికి ఇంత శ్రద్ధ ఉంటే అన్ని సౌకర్యాలు కలిగిన మనకెంత శ్రద్ధ ఉండాలి. కాఫీ హౌస్‌లకెళ్లి, ట్యుటోరియల్స్‌కెళ్లి టైం వేస్ట్ చేయడం ఇక అనవసరం. వీడిలాగా చిత్తశుద్ధి ఉంటే ఏమైనా సాధించగలం' అని ఈ బుడతడిని స్వయంగా కలుసుకున్న జియోమన్ ప్రాబర్ట్ లాడ్రా అలయాన్ అనే విద్యార్థి సోషల్ వెబ్‌సైట్‌లో వ్యాఖ్యానించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement