'అణుయుద్ధం తప్పకపోవచ్చు'

19 Dec, 2017 11:08 IST|Sakshi

సాక్షి, ఇస్లామాబాద్‌ : దక్షిణాసియా ప్రాంత స్థిరత్వం దెబ్బతినే ప్రమాదం ఉందని, అది ప్రమాదపుటంచుల్లో వేలాడుతుందంటూ పాకిస్థాన్‌ భద్రతా సలహాదారు రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ నజీర్‌ ఖాన్‌ జాంజువా ఆందోళన వ్యక్తం చేశారు. అణుయుద్ధం జరిగే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అన్నారు. చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌(సీపెక్‌) విషయంలో భారత్‌తో కలిసి అమెరికా కుట్ర చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇస్లామాబాద్‌లో జాతీయ భద్రత అనే అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్‌ అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలన్నింటిని సమకూర్చుకొని స్టాక్‌ పెట్టుకుంటుందని, వాటితో ప్రతిసారి పాక్‌ను బెదిరిస్తూ వస్తోందని చెప్పారు. 'దక్షిణాసియా స్థిరత్వం ప్రమాదపుటంచున వేలాడుతోంది. అణుయుద్ధం జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం' అని ఆయన వ్యాఖ్యానించారు. అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్‌ల ప్రభావం పెరుగుతుండటంతో అమెరికా వైఫల్యాలను పాకిస్థాన్‌పై నెడుతోందంటూ ఆరోపించారు. అప్ఘనిస్థాన్‌ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశం అమెరికా భారత్‌కు కల్పిస్తోందంటూ మండిపడ్డారు.

మరిన్ని వార్తలు