చిన్నారుల కోసం తల్లడిల్లుతున్న సోషల్‌ మీడియా! | Sakshi
Sakshi News home page

ఆ చిన్నారుల కోసం తల్లడిల్లుతున్న సోషల్‌ మీడియా!

Published Wed, Feb 28 2018 1:31 PM

Pray For Syria  hashtag movement for syira kids - Sakshi

సిరియాలో బాల్యం  రక్తమోడుతోంది. గత కొన్ని సం‍వత్సరాలు అంతర్యుద్ధంలో చిక్కుకొని.. నిత్యం బాంబు దాడులు, తుపాకుల మోతతో రక్తసిక్తమవుతున్న సిరియాలో బాల్యం చితికిపోతోంది. తుపాకుల తూటాల నడుమ, విస్ఫోటన శిథిలాలలో నెత్తుటి చారికలతో బిక్కుబిక్కుమంటున్న అమాయక పసిమోములు, కల్మశం లేని చిన్నారుల ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో నెటిజన్లను కదిలిస్తున్నాయి. యుద్ధక్షేత్రం మారిన సిరియాలో అమాయక బాల్యం ఎలా నరకం అనుభవిస్తుందో.. ఎలా నిత్యం రకప్తుటేరుల మధ్య నలిగిపోతుందో చాటుతున్న ఫొటోలు నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్నాయి.

ఒకప్పుడు యుద్ధ సంక్షోభ సిరియా నుంచి సురక్షిత ప్రాంతానికి పడవలో వెళ్తూ మృతిచెందిన చిన్నారి అయ​‍్లాన్‌ కుర్దీ ఫొటో యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతపరిచింది. సముద్రం ఒడ్డున విగతజీవిగా పడి ఉన్న ఆ బాలుడి ఫొటో అప్పట్లో అందరినీ కదిలించింది. ఆ తర్వాత కూడా సిరియాలో రక్తసిక్త దాడులు, ప్రభుత్వ దళాలు, వేర్పాటువాద మిలిటెంట్లు, ఉగ్రవాద సంస్థల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సిరియా హింసలో ఛిద్రమవుతున్న చిన్నారుల ఫొటోలను తాజాగా సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఒక ఉద్యమం తరహాలో పెద్ద ఎత్తున షేర్‌ చేస్తున్నారు.

‘ప్రే ఫర్‌ సిరియా’ (సిరియా కోసం ప్రార్థించండి) హాష్‌ట్యాగ్‌తో ఈ ఫొటోలను పంచుకుంటున్నారు. సిరియాలో  ఛిన్నాభిన్నామైపోతున్న బాల్యాన్ని కాపాడాలని, మానవత్వాన్ని చూపాల ని, అక్కడి చిన్నారులకు కూడా అందరి బాలల్లాగే సంతోషంగా బతికే హక్కు కల్పించాలని, ఈ దిశగా ప్రపంచ దేశాల్ని కదిలించాలని కోరుతూ ఈ హాష్‌ట్యాగ్‌ ఉద్యమం నడుస్తోంది. తాజాగా టాలీవుడ్‌ నటి మెహ్రీన్‌ ఫిర్జాదా కూడా ఈ హ్యాష్‌ట్యాగ్‌ జోడించి సిరియా చిన్నారి ఫొటోను ట్వీట్‌ చేశారు. సిరియాలో చిన్నారులు ఎదుర్కొంటున్న హింస, కూరత్వం, చిన్నారుల మారణహోమాన్ని చూస్తే హృదయం ద్రవించుకుపోతోందని, మానవత్వాన్ని చాటుతూ అక్కడ శాంతి కోసం ప్రార్థించాలని ఆమె ట్వీట్‌ చేశారు.

తాజాగా కొద్ది రోజులుగా సిరియాలోని గౌటా నగరంపై ప్రభుత్వ దళాలు మిలిటెంట్లపై కొనసాగిస్తున్న  దాడుల్లో కనీసం 700 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో 200 మంది చిన్నారులు, 110 మంది మహిళలు కూడా ఉన్నారు. వైమానిక దాడుల్లో ఆస్పత్రి భవనాలు, వందకొద్దీ ఇళ్లు నేలమట్టమయ్యాయి. ముందస్తుగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఆ తర్వాత మిలిటెంట్లపై దాడులు చేయాల్సిన ప్రభుత్వాలు.. ఏకబిగిన జనావాసాలపై బాంబులు జారవిడుస్తున్నాయి. దీంతో గౌటాలో ఎక్కడిక్కడ నెత్తురు ఏరులైపారుతోంది. దేశ రాజధాని డమస్కస్‌ శివారు నగరమైన గౌటా 2013లో ప్రభుత్వ బలగాల ఆధీనంలో ఉండేది. అయితే మిగతా ప్రాంతాల్లో చావుదెబ్బతిన్న మిలిటెంట్లు వేలమంది.. సాధారణ జనంతో కలిసిపోయి గౌటా నగరంలోకి చొచ్చుకొచ్చారు. 2017నాటికి వారు తిరిగి ఆయుధ సంపత్తిని పోగేసి గౌటాలో సొంత పెత్తనం చెలాయించే స్థితికి చేరుకున్నారు. తహ్రీర్‌ అల్‌ షమ్‌, అల్‌ రహమాన్‌ లీజియన్‌, జైష్‌ అల్‌ ఇస్లామ్‌ తదితర గ్రూపులు తమలోతాము కలహించుకుంటూ, ప్రభుత్వ బలగాలతోనూ తలపడుతూ జనాన్ని కాల్చుకు తింటున్నాయి.

1/4

2/4

3/4

4/4

Advertisement
Advertisement