నేను కాదు.. ట్రంప్‌ అర్హుడు | Sakshi
Sakshi News home page

నేను కాదు.. ట్రంప్‌ అర్హుడు

Published Tue, May 1 2018 1:24 AM

President Donald Trump should be awarded Nobel Peace Prize, South Korean leader says - Sakshi

సియోల్‌/వాషింగ్టన్‌: ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను శాంతి చర్చలకు ఒప్పించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నోబెల్‌ శాంతి బహుమతికి అర్హుడని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ వ్యాఖ్యానించారు. తనకు నోబెల్‌ శాంతి బహుమతి అక్కర్లేదనీ, శాంతి చాలని వ్యాఖ్యానించారు.

కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొల్పే దిశగా ఉభయకొరియాల అధ్యక్షులు కిమ్, మూన్‌ల మధ్య శుక్రవారం చరిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం జరిగిన  సంగతి తెలిసిందే. దీంతో ద.కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్‌ డే జుంగ్‌ భార్య మూన్‌కు అభినందనలు తెలుపుతూ లేఖరాశారు. ఇరుదేశాల మధ్య శాంతిస్థాపనకు చేసిన కృషికి ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రకటించే నోబెల్‌ బహుమతిని మూన్‌ అందుకునే అవకాశముందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో నోబెల్‌ శాంతి బహుమతికి తనకన్నా ట్రంపే అర్హుడని మూన్‌ సమాధానమిచ్చారు.

టైమ్‌ జోన్‌ మార్చుకోనున్న ఉ.కొరియా
ద.కొరియాకు సమానంగా తమ టైమ్‌జోన్‌ను 30 నిమిషాలు ముందుకు జరపనున్నట్లు ఉ.కొరియా అధికారిక వార్తాసంస్థ కేసీఎన్‌ఏ తెలిపింది. ఉభయకొరియాల మధ్య ఇటీవల స్నేహపూర్వక సంబంధాలు నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2015లో ఉ.కొరియా తమ టైమ్‌జోన్‌ను అరగంట వెనక్కు జరిపింది.

Advertisement
Advertisement