కూల్ డ్రింకులకు నీటిని జోడిస్తే... | Sakshi
Sakshi News home page

కూల్ డ్రింకులకు నీటిని జోడిస్తే...

Published Mon, Aug 15 2016 1:20 PM

కూల్ డ్రింకులకు నీటిని జోడిస్తే...

న్యూయార్క్ః చక్కెర పానీయాలు, కూల్ డ్రింకులు, పంచదార సోడాల్లో కొద్దిగా నీళ్ళు కలిపి తాగడం వల్ల శరీర బరువు తగ్గించుకోవచ్చనంటున్నాయి తాజా అధ్యయనాలు. తీవ్రమైన, దాహాన్ని తీర్చుకునేందుకు మంచినీళ్ళకు బదులుగా చక్కెర పానీయాలను ఆశ్రయించేవారు వాటిలో కొద్దిగా నీటిని కలిపి తాగడంవల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు.

సోడాలు, ఎనర్జీ డ్రింకులు, స్వీట్ కాఫీలు శారీరక బరువును పెంచుతాయని, ఊబకాయానికి కారణమౌతాయని అలాగే వాటితో టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుందని  అంటున్నారు పరిశోధకులు. రోజువారీ తీసుకునే పానీయాల్లో ఒక్కటైనా ఆరోగ్యానికి ఉపయోగపడేదిగా ఉండాలని అమెరికా బ్లాక్స్ బర్గ్, వర్జీనియా టెక్ యూనివర్శిటీ పరిశోధకులు కియా జె డఫీ తెలిపారు.  8 ఔన్సుల శీతల పానీయంలో 8 ఔన్సుల నీటిని జోడించి తాగడంవల్ల కేలరీలను తగ్గించడంతోపాటు, శరీరంపై ఊబకాయం ప్రభావం తగ్గుతుందని చెప్తున్నారు. రోజువారీ ఒకసారి సేవించే శీతలపానీయంలో నీటిని కలిపి తాగడం వల్ల పానీయాలనుంచి వచ్చే సుమారు 11నుంచి 17 శాతం కేలరీలు తగ్గుతాయని తమ అధ్యయనాల్లో గుర్తించినట్లు డఫీ తెలిపారు.

ప్రతిరోజూ అధికమొత్తంలో శీతల పానీయాలు సేవించేవారు కూడా నీటిని జోడించి సేవించడంవల్ల శరీరానికి  రోజువారీ అందే కేలరీల్లో 25 శాతం తగ్గి లాభదాయకమైన ప్రయోజనాలు ఉన్నట్లు గుర్తించామని పరిశోధకులు న్యూట్రియంట్ జర్నల్ లో నివేదించారు. అధిక కేలరీలు కలిగిన ఆహారం కన్నా.. తక్కువ కేలరీలు ఉండే నీరు, చక్కెర లేని కాఫీ, టీ, కూరగాయలు, తృణ ధాన్యాలు, చేపలు, పౌల్ట్రీ సంబంధ పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని, డైట్ డ్రింకులు కూడా శీతల పానీయాలకు ప్రత్యామ్నాయాలుగా వాడొచ్చని డఫీ వివరించారు.

Advertisement
Advertisement