మొగాబే దంపతుల విలాసాలు చూస్తే.. విస్తుపోవాల్సిందే! | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 20 2017 5:18 PM

Robert Mugabe's vast wealth exposed  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సైనిక కుట్ర ద్వారా పదవీచ్యుతుడై ప్రస్తుతం గహ నిర్బంధం అనుభవిస్తున్న జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ మొగాబే దంపతులు, వారి పిల్లలు ఇంతకాలం అనుభవించిన రాజభోగాల గురించి, వారి విలాసాల కులాసాల జీవితాల గురించి ఎవరైనా వింటే విస్తుపోవాల్సిందే. మొగాబే దంపతులు జింబాబ్వే రాజధాని హరారేలోని 75 కోట్ల రూపాయల విలాసమైన భవంతి (బ్లూరూఫ్ మాన్షన్) లో నివసిస్తున్నారు. ఈ భవంతిలో సకల సౌకర్యాలతో 25 పడక గదులు ఉన్నాయి. ప్రస్తుతం ఇదే భవంతిలో మొగాబే, ఆయన భార్య గుస్సీ గ్రేసీ గహ నిర్బంధంలో ఉన్నారు. మొగాబేకు 93 ఏళ్లుకాగా, గుస్సీ గ్రేసికి 52 ఏళ్లు. ఇద్దరి మధ్య వయస్సు తేడా 41 ఏళ్లు. కేవలం రాజరికం భోగభాగ్యాలను అనుభవించేందుకే మొగాబేను విడిచిపెట్టకుండా ఇప్పటికీ అంటుకు తిరుగుతుందని జింబాబ్వే ప్రజలు భావిస్తారు. అంతకంటే ఎక్కువ వారిని తిరుగులేని అధికారం కలిసి ఉండేలా చేసింది. 

ప్రపంచంలో జింబాబ్వే కడు పేద దేశం. అక్కడ ప్రతి పదిమందిలో ఏడుగురు రెండు పూటలు కూడా కడుపునిండా తిండిలేక పస్తులతో అలమటిస్తుంటారు. అలాంటి దేశంలో మొగాబే కుటుంబం ప్రజల చెమట, నెత్తురుతో సుఖ జీవితాలను అనుభవిస్తున్నారు. సైన్యానికి మొగాబే కోపం రావడానికి ఇదొక కారణంగా చెప్పవచ్చు. ఆ దంపతులకు ఒక్క హరారేలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో సొంత భవనాలు ఉన్నాయి. ఇక మొగాబే భార్య గుస్సీ గ్రేసి డబ్బులను విచ్చిల విడిగా ఖర్చుపెట్టడంలో ఎంతో విఖ్యాతి చెందిన వారు. ఆమె తన కూతురు పెళ్లి కోసం 30 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. ఇటీవలనే ఆమె మూడు కోట్ల రూపాయలు పెట్టి రోల్స్ రాయిస్ కారు కొన్నారు. ఆమె తలగడ పక్కన రెండు కోట్ల రూపాయల వజ్రం పొదిగిన డ్రా ఉంటుంది. ఇక 12 వజ్రపు ఉంగరాలు, 62 జతల ఖరీదైన ఫెర్రగామో చెప్పులు, 80 లక్షల రూపాయల రోలెక్స్ వాచ్లు ఆమెకున్నాయి. 

ఆమె ప్యారిస్ పర్యటనకు వెళ్లినప్పుడు ఒక్కరోజే కోటి ఇరవై లక్షల రూపాయల షాపింగ్ చేశారు. ఏడాదికి ఆమె షాపింగ్ల ఖర్చు 20 కోట్ల రూపాయలకు పైనేనని 2014లో నిపుణులు అంచనా వేశారు. తల్లే ఇలా ఉంటే పుత్రులు ఇంకా ఎలా ఉండాలి? చిన్న కొడుకు ఛాతుంగ దక్షిణాఫ్రికాలో ఓ రోజు 45 లక్షల రూపాయల వాచ్పై 20 వేల రూపాయల ఆర్మండ్ షాంపేన్ బాటిల్ను కుమ్మరించిన ఆనందాన్ని ఆస్వాదించారు. పైగా దాని తాలూకు వీడియోను ‘స్నాప్చాట్’లో పోస్ట్ చేశారు. ఒకప్పుడు కోడి మాంసం అమ్ముకుని బతికే గుస్సీ గ్రేసి మొదట మొగాబే వద్ద టైపిస్ట్గా చేరారు. ఆయన మొదటి భార్య సాలీ తీవ్రంగా జబ్బు పడడంతో మొగాబేకు దగ్గరయ్యారు. 1996లో వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆ పెళ్లి వైభవాన్ని చూసి జింబాబ్వేలోనే ‘వెడ్డింగ్ ఆఫ్ ది సెంచరీ’గా కీర్తించారు. మొగాబే మూడేళ్ల క్రితమే, అంటే తన 90వ జన్మదినోత్సవాన్ని ఆరుకోట్ల ఖర్చుపెట్టి జరుపుకున్నారు. ఇక గుస్సీ గ్రేసి తమ 20వ వివాహ వార్షికోత్సవానికి 9 కోట్ల రూపాయలు పెట్టి డైమండ్ రింగ్ను కొనుకొన్నారు. అంతేకాకుండా ఆమె బెదరించి ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఐదు డెయిరీ ఫామ్లను స్వాధీనం చేసుకున్న ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి. మొగాబే ఏకైక పుత్రిక బోనా వివాహాన్ని కూడా ఆ దంపతులు 2014లో అంగరంగ వైభవంగా చేశారు. ఆ ఖర్చు వివరాలు మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు. 
 

Advertisement
Advertisement