రాక్‌స్టార్.. మోదీ! | Sakshi
Sakshi News home page

రాక్‌స్టార్.. మోదీ!

Published Tue, Nov 18 2014 6:46 AM

రాక్‌స్టార్.. మోదీ! - Sakshi

సిడ్నీ: సిడ్నీలోని ఆల్ఫోన్స్ ఎరీనా ఒలింపిక్ పార్క్ సోమవారం ‘మోదీ మేనియా’తో ఉర్రూతలూగింది. తెల్లని కుర్తాపై, ముదురు నీలంరంగు స్లీవ్‌లెస్ జాకెట్ ధరించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ‘రాక్‌స్టార్ షో’తో అమెరికాలోని మేడిసన్‌స్క్వేర్‌ను గుర్తుకు తెచ్చారు. 20 వేలకు పైగా హాజరైన ప్రజలు..ముఖ్యంగా యువతీయువకులు.. మోదీ ప్రతీ మాటకు చప్పట్లు, కేరింతలతో స్పందించారు. ‘మోదీ.. మోదీ’, ‘రాక్‌స్టార్.. మోదీ’ అనే నినాదాలతో హోరెత్తించారు.

మోదీ ముఖచిత్రంతో పాటు ‘ఆస్ట్రేలియాలో మోదీ’ అనే కామెంట్ ఉన్న టీ షర్టులను ధరించి తమ అభిమానం చాటుకున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ వినిపిస్తుండగా.. డ్యాన్స్‌లు, పాటలతో ప్రాంగణాన్ని పరవళ్లు తొక్కించారు. ఆస్ట్రేలియా నలుమూలల నుంచే కాకుండా.. న్యూజీలాండ్, సింగపూర్, అమెరికాల నుంచి కూడా భారీగా అభిమానులు తరలివచ్చారు.

మోదీ ప్రసంగ ప్రత్యక్ష ప్రసారం కోసం భారత్‌నుంచి 25పైగా వార్తా చానెళ్లు తమ సిబ్బందిని పంపించాయి. మెల్బోర్న్ నుంచి 220 మంది అభిమానులతో ‘మోదీ ఎక్స్‌ప్రెస్’ రైలు తరలివచ్చింది. సభాప్రాంగణం నిండిపోవడంతో వేలాదిమంది బయటే ఉండిపోయారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్‌లపై కార్యక్రమాన్ని తిలకించారు.
 

Advertisement
Advertisement