రోజీ.. ఓ ‘వజ్రం’లాంటి శునకం! | Sakshi
Sakshi News home page

రోజీ.. ఓ ‘వజ్రం’లాంటి శునకం!

Published Thu, Jan 1 2015 2:51 AM

రోజీ.. ఓ ‘వజ్రం’లాంటి శునకం!

లండన్: ఇంగ్లాండ్‌లో అలెన్ బెల్ అనే ఓ మాజీ లారీ డ్రైవర్ పంట పండింది. ఉదయం పూట తన రెండు శునకాలతో కలిసి నడకకు వెళ్లిన అతడికి సుమారు రూ. 12 లక్షల విలువైన వజ్రం దొరికింది. అంతరిక్షం అంచుల దాకా వెళ్లి భూమికి తిరిగి వచ్చిన ఆ వజ్రాన్ని పెంపుడు శునకం రోజీ పసిగట్టడం అసలు విశేషం. వాస్తవానికి బ్రిటన్ ఆన్‌లైన్ రిటైలర్ కంపెనీ ‘77 డైమండ్స్’ వారు ఆగస్టు 7న ఆ వజ్రాన్ని ఆకాశానికి పంపించారు.

ఓ రాడ్‌కు అమర్చి, దానిని ప్యాక్ చేసి హీలియం బెలూన్  ద్వారా నింగికి పంపారు. సుమారు లక్ష అడుగుల పైకి వెళ్లిన తర్వాత హీలియం బెలూన్ పగిలిపోయి పారాచూట్ సాయంతో ఆ వజ్రం తిరిగి కొన్ని గంటలకు భూమిని చేరింది. అయితే, ఆ వ జ్రం ఎవరికి దొరికితే వారే తీసుకోవచ్చని కంపెనీవారు ప్రకటించారు. ఆ వజ్రం లింకన్‌షైర్‌లోని 60 మైళ్ల ప్రాంతంలో పడవచ్చని క్లూ కూడా ఇచ్చారు. దీంతో ఎంతో మంది వజ్రం కోసం అన్వేషించారు.

లింకన్‌షైర్‌లోని బ్రాటిల్‌బై అనే గ్రామానికి చెందిన 75 ఏళ్ల అలెన్ బెల్ కూడా తన  శునకాలు రోజీ, డైలన్‌లతో కలిసి నడకకు వెళుతూ అన్వేషణ మొదలుపెట్టారు. చివరికి డిసెంబరు 23న ఓ చోట ముళ్ల కంచెలో పారాచూట్‌ను పసిగట్టిన రోజీ దానిని బయటికి లాగి యజమానికి చూపించింది. ప్రస్తుతం ఆ వజ్రాన్ని విక్రయించేందుకు అలెన్ సిద్ధమవుతున్నాడు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement