రుయాన్‌టాంగ్.. ఈగ | Sakshi
Sakshi News home page

రుయాన్‌టాంగ్.. ఈగ

Published Tue, Jun 10 2014 1:39 AM

రుయాన్‌టాంగ్.. ఈగ - Sakshi

రాజమౌళి ఈగ సినిమా అందరికీ తెలిసిందే.. మరి ఈ రుయాన్ టాంగ్.. ఈగ సంగతేంటి? అసలు ఈమెకు ఈగకు సంబంధమేంటి? చైనాలోని హాంగ్‌జో సిటీకి చెందిన రుయాన్‌టాంగ్ 14 ఏళ్ల క్రితం రిటైరైంది. ఎవరైనా ఖాళీగా ఉంటే.. ఈగలు తోలుకుంటున్నారు అని అంటారు. ఈమె ఖాళీనే.. కానీ ఈగలు తోలడం లేదు. వాటి తాట తీస్తోంది. రుయాన్ టాంగ్ ఈగల కిల్లర్! పదవీ విరమణ చేసిన తర్వాత సమాజానికి ఉపయోగపడే పనేదైనా చేయాలని టాంగ్ భావించింది. అందర్నీ ఇబ్బంది పెడుతున్న ఈగల సమస్యను ఆమె గమనించింది. అంతే.. అప్పట్నుంచి వాటి అంతు తేల్చాలని నిర్ణయించింది.
 
 రోజుకు 8 గంటలపాటు రోజూ ఆమెకు ఇదే పని. చేతిలో ఈగల్ని చంపే ఆయుధాన్ని తీసుకుని రోడ్డెక్కుతుంది. ముందుగా రెండు గంటలపాటు చెత్త కుప్పలపై ప్రత్యేక నిఘా పెడుతుంది. అక్కడున్నవాటి అంతు తేల్చాకే.. మిగతా వాటి పని పడుతుంది. ఆ రోజు అదృష్టం బాగుంటే.. కనీసం వెయ్యింటిని చంపుతుందట. మనకిది విచిత్రంగా అనిపించినా.. ఆమె లోకల్‌గా హీరో. స్థానిక మీడియా సైతం ఇదే చెబుతోంది. వ్యాధులను వ్యాపింపజేసే లక్షలాది ఈగలను చంపడం ద్వారా టాంగ్ సమాజ సేవ చేస్తోందని కీర్తిస్తోంది. ఆవిడే కనుక రంగంలోకి దిగకపోయినట్లయితే.. ఇక్కడ ఈగలు రాజ్యమేలేవని చెబుతోంది.

Advertisement
Advertisement