వామ్మో.. ఆమె కాళ్లు అంత పొడవా! | Sakshi
Sakshi News home page

వామ్మో.. ఆమె కాళ్లు అంత పొడవా!

Published Sat, Sep 9 2017 7:01 PM

Russian model Ekaterina Lisina placed in Guinness record for long legs



మాస్కో:
కాస్త కాళ్లు పొడవుగా ఉంటేనే పొడుగుకాళ్ల సుందరి అంటూ పేరు పెట్టేస్తారు. మరి రష్యా మోడల్‌ ఎకటెరినా లిసినాను ఏమనాలో మీరే చదవండి. ప్రపంచంలోనే పొడవైన మోడల్‌గా వరల్డ్ రికార్డును తన పేరున లిఖించుకున్న ఈ రష్యన్ సుందరి, తాజాగా గిన్నిస్ రికార్డులను బద్ధలుకొట్టారు. ప్రపంచంలోనే అత్యంత పొడుగు కాళ్లు కలిగిన మహిళగా, అత్యంత పొడవైన మోడల్‌గానూ ఎకటెరినా లిసినా 2018 గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు. ఆమె పొడవు 6.9 అడుగులు కాగా, కాళ్ల పొడవు మాత్రం ఒక్కో కాలుకు ఓ లెక్క ఉంది.

ఆమె రెండు కాళ్ల మొత్తం పొడవు 265 సెంటీమీటర్లు. ఎడమ కాలు పొడవు 132.8 సెం.మీ (52.2 ఇంచులు) కాగా, కుడి కాలు పొడవు 132.2 సెం.మీ (52.0 ఇంచులు) ఉంది. గత జూన్‌ 13న ఆమె కాళ్ల కొలతలు తీసుకున్న గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు అత్యంత పొడుగు కాళ్ల మహిళగా గుర్తించి ఆమెకు ధ్రువపత్రం అందజేశారు. సహజంగానే ఆమె కుటుంబంలోని వ్యక్తులు ఆరడుగుల ఎత్తు ఉండగా, అందులోనూ ఎకటెరినా లిసినానే అందరికంటే పొడగరి. ఆమె సోదరుడు 6.6 అడుగులు ఉండగా, తండ్రి 6.5 అడుగులు, తల్లి 6 అడుగుల ఎత్తు ఉన్నారు.

ఎకటెరినా మోడలే గాక ప్రముఖ బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారిణి అని చెప్పవచ్చు. 2008లో జరిగిన ఒలింపిక్స్‌లో బాస్కెట్‌బాల్‌ క్రీడలో కాంస్య పతకం గెలిచిన రష్యా జట్టులో ఆమె సభ్యురాలు కావడం గమనార్హం. తన కూతురుకు గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కడంపై ఎకటెరినా తండ్రి విక్టర్‌ లిసిన్‌ హర్షం వ్యక్తం చేశారు. 'మా అమ్మాయికి పుట్టినప్పుడే కాళ్లు పొడుగున్నాయి. మా ఇంట్లో అందరిలాగే ఆమె కూడా చాలా ఎత్తు పెరిగారు. దీంతో నేడు ఆ కాళ్లే నా కూతురికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయని' చెప్పారు.

నా కాళ్లంటే నాకెంతో ఇష్టం. ఈ కాళ్లే మోడలింగ్ ప్రపంచంలో నాకు అవకాశాలు, గుర్తింపు తెచ్చిపెట్టాయి. గతంలో ఆటలో రాణించేందుకు తోడ్పడ్డ కాళ్లు.. ప్రస్తుతం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ చోటును కల్పించాయి. చాలా మంది మోడళ్లు పొట్టిగా ఉండటంతో ఈ రంగంలో రాణించలేమని దిగులు చెందుతారు. నాకు మాత్రం అలాంటి సమస్య లేదని' ఎకటెరినా లిసినా గిన్నిస్ రికార్డుపై ఇలా స్పందించారు.



Advertisement
Advertisement