ఆ ఉగ్రవాదుల అంతు చూస్తా: పుతిన్ ప్రతిన | Sakshi
Sakshi News home page

ఆ ఉగ్రవాదుల అంతు చూస్తా: పుతిన్ ప్రతిన

Published Tue, Nov 17 2015 5:28 PM

ఆ ఉగ్రవాదుల అంతు చూస్తా: పుతిన్ ప్రతిన

మాస్కో: గత నెల ఈజిప్టులోని సినాయ్‌ ద్వీపకల్పంలో తమ దేశ విమానాన్ని కూల్చేసిన వారి అంతుచూసే దాకా నిద్రపోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిన బూనారు. విమానాన్ని కూల్చేసి.. 224 మంది మృతిచెందడానికి కారణమైన వారిని పట్టుకొని చట్టం ద్వారా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. విమానం కూల్చివేతకు కారణమైన వారి సమాచారాన్ని తెలియజేసిన వారికి 50 మిలియన్ డాలర్లు (రూ. 330 కోట్లు) బహుమానం ఇస్తామని రష్యా ప్రభుత్వం తెలిపింది.

అధ్యక్షుడు పుతిన్‌తో సోమవారం రష్యా భద్రతా చీఫ్ అలెగ్జాండర్ బోట్ర్‌నికోవ్ భేటీ అయి.. ఈజిప్టులో కూలిన విమానం ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తముందని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు పెట్టిన బాంబు వల్లే విమానం ఆకాశంలో ముక్కలైందని వెల్లడించారు. దీనిపై పుతిన్ స్పందిస్తూ ' కారకులు ఎక్కడ దాగివున్నా.. వారి వెతికి మరీ పట్టుకుంటాం. ప్రపంచంలోని ఏ మూల దాగున్నా సరే..  వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. వారిని శిక్షించి తీరుతాం' అని బొట్ర్‌నికోవ్‌తో చెప్పారని క్రెమ్లిన్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

రష్యాకు చెందిన ఫ్లయిట్ నెంబర్‌ 7K9268 ఎయిర్‌బస్-321 విమానం గత నెల 31న ఈజిప్టులోని షర్మ్-అల్-షేక్ విమానాశ్రం నుంచి బయలుదేరిన కాసేపటికే కూలిపోయింది. 224 మందితో ప్రయాణించిన ఈ విమానాన్ని తామే కూల్చేశామని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement