విషాదంతో కోర్టు బోనులో మాజీ అధ్యక్షురాలు | Sakshi
Sakshi News home page

విషాదంతో కోర్టు బోనులో మాజీ అధ్యక్షురాలు

Published Thu, Mar 30 2017 8:53 AM

విషాదంతో కోర్టు బోనులో మాజీ అధ్యక్షురాలు

సియోల్‌: అధ్యక్ష పదవిని కోల్పోయిన దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్‌ గుయాన్‌ హై కోర్టు మెట్లెక్కారు. విషాదవదనంతో, భయకంపితురాలై, పాలిపోయిన ముఖంతో కనీసం పలకరించినవారితో కూడా ఒక్కమాట మాట్లాడకుండా ఆమె కోర్టుకు హాజరయ్యారు. అవినీతి ఆరోపణలకు సంబంధించి పార్క్‌ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విచారిస్తున్న కమిటీ ఆమెను అరెస్టు చేయాలని, బయటే ఉంటే ఆమెపై నమోదైన కేసును ట్యాంపరింగ్‌ చేసే అవకాశం ఉందని, సాక్షులను ప్రభావితం చేస్తారని ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

దీంతో ఆమెను మాములుగా ఎప్పుడంటే అప్పుడు పిలిచి విచారణ చేయాలా లేక పోలీసుల కస్టడీకి అప్పగించి విచారణ చేయించాలా అనే విషయాన్ని తేల్చేందుకు సియోల్‌ సెంట్రల్‌ డిస్ట్రిక్‌ కోర్టుకు పిలిపించారు. ఈ నేపథ్యంలో ఆమె గురువారం ఉదయం కోర్టుకు హాజరయ్యారు. పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకోవడంతోపాటు, ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం బయటకు చేరవేశారని, అధికారం సహాయంతో కుంభకోణాలకు దిగారని, రహస్యంగా పనులు చక్కబెట్టుకొనే ప్రయత్నాలు చేశారని పలు రకాల ఆరోపణలు వచ్చాయి.

దీంతో ఆమె పదవి నుంచి దిగిపోవాల్సిందేనంటూ పెద్ద మొత్తంలో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేయడంతో ఉన్నత స్థాయి కోర్టు ఆదేశాల మేరకు ఆమె పదవిని కోల్పోయారు. ఈ కేసును విచారిస్తున్న కమిటీ దాదాపు 1,20,000 పేజీల పత్రాలను పార్క్‌కు కేసుకు సంబంధించి సెంట్రల్‌ జిల్లా కోర్టుకు అప్పగించింది. ఆమెను అరెస్టు చేస్తారా, కేవలం ఇంటివద్ద ఉంచి అవసరం అయినప్పుడు విచారణకు పిలిపిస్తారా అనే విషయం నేడు తేలే అవకాశం ఉంది.
 

Advertisement
Advertisement