సౌదీ ఎన్నికల్లో తొలిసారి మహిళలు

13 Dec, 2015 02:33 IST|Sakshi
సౌదీ ఎన్నికల్లో తొలిసారి మహిళలు

మహిళా ఓటర్లకు మొదటిసారి అవకాశం
ఎన్నికల బరిలో 900 మంది మహిళలు

 
 రియాద్: సౌదీ అరేబియాలో చారిత్రక ఘట్టం. ఈ ఇస్లామిక్ దేశంలో మొట్టమొదటిసారిగా మహిళలను ఓటు వేసేందుకు అనుమతించారు.మహిళలు ఎన్నికల్లో పోటీచేసేందుకూ తొలిసారి అవకాశం కల్పించారు. పెరుగుతున్న లింగవివక్షను నియంత్రించేందుకు ప్రయోగాత్మకంగా ఈ విధానం ప్రవేశపెట్టారు. శనివారం జరిగిన మునిసిపల్ కౌన్సిల్స్ ఎన్నికల్లో 900 మందికిపైగా మహిళా అభ్యర్థులు పోటీలో పాల్గొనగా, 6 వేల మంది పురుషులు బరిలో ఉన్నారు. రాచరిక పాలన ఉన్న సౌదీలో ప్రజలు ఓటేసి ఎన్నుకునేది ఒక్క ఈ మునిసిపల్ కౌన్సిల్స్‌నే. మహిళలను డ్రైవింగ్‌కుకూడా అనుమతించని సౌదీలో వారు కచ్చితంగా తల నుంచి పాదం వరకు పూర్తిగా కప్పివుంచే దుస్తులే ధరించాలి.

ఇంతటి ఆంక్షలున్న సౌదీలో జరిగిన ఈ చారిత్రక ఎన్నికల్లో పోటీచేసేందుకు మహిళలు ఎన్నో ఆటంకాలను అధిగమించారు. మహిళా అభ్యర్థులు ప్రచారంలో బహిరంగ ప్రదేశాల్లో మగ ఓటరును నేరుగా కలవకూడదనే ఆంక్షలుండటంతో ఎక్కువగా ఇంటర్నెట్ ద్వారా ప్రచారం చేశారు. రియాద్ శివార్లలోని దిరియా నుంచి బరిలోకి దిగిన అల్జజి అల్-హొసేనీ ఇంటర్నెట్ ద్వారా 12 రోజులు ప్రచారం చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అధికారులు తమకు ఎన్నో ఆటంకాలు కల్పించారని, ఈ విధానంపై అవగాహన కల్పించలేదని మహిళా ఓటర్లు వాపోయారు. వేర్వేరు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయగా, నమోదిత ఓటర్లలో పది శాతంకన్నా తక్కువ మంది మహిళలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అతి కొద్దిమంది మహిళలు ఎన్నికల్లో గెలవచ్చని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు